గ‌త‌ నెల 25అర్ధరాత్రి నుంచి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించింది. 21రోజుల పాటు దేశాన్ని మొత్తం స్థంభింపజేసింది. దీంతో వలస కార్మికులంతా ఉపాధి కోల్పోయారు. దీంతో... దేశ రాజ‌ధాని ఢిల్లి నుంచి జాతీయ రహదార్ల వెంబడి ఇటు ముంబయ్‌, అటు ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్‌ల వైపు లక్షలాదిమంది రోజూ నడుస్తున్నారు. తమ వెంట కొద్దిపాటి సామాగ్రితో పాటు మహిళలు, పిల్లల్ని కూడా వెంటబెట్టుకుని ముందుకు సాగుతున్నారు. వీరంతా లక్షల సంఖ్యలోఉన్నారు. దూరం నుంచి చూస్తే ఓ జన ప్రవాహం తరలొస్తుందా అన్న రీతిలో కనిపిస్తున్నారు. వీరంతా వలస కార్మికులు. బీహార్‌, ఒడిషా, పశ్చిమబెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్‌లలోని గ్రామాలకు చెందినవారు. వీరంతా ఢిల్లీతో పాటు హర్యానాల్లోని పట్టణాల్లో కార్మికులుగా పని చేస్తున్నారు. ఇప్పుడు వీరి విష‌యంలోనే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

 

 

దేశంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కార్మికుల వలసల్ని నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సు ప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న వలస కార్మికులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి సుశిక్షితులైన నిపుణుల సాయాన్ని తీసుకోవాలని సూచించింది. ఈ  పునరావాస కేం ద్రాలను పోలీసుల నేతృత్వంలో గాకుండా, వలంటీర్ల ఆద్వర్యంలో నిర్వహించాలని ఆదేశించింది. కార్మికుల వలసల్ని నియంత్రించి వారికి కావాల్సిన ఆహారం, ఆశ్ర యం, పోషణ, వైద్య సదుపాయాలు అందించాలని కేంద్రాన్ని కోరింది. వలస కార్మికుల అంశంపై హైకోర్టులు మరింత లోతుగా విచారించగలవని పేర్కొన్న అత్యున్నత ధర్మాసనం కేసు విచారణను ఏప్రిల్‌ 7కు వాయిదా వేసింది.

 

కాగా, వీరి విష‌యంలో మ‌రో కొత్త‌, సానుకూల ప్ర‌త్యామ్నాయం తెర‌మీద‌కు వ‌స్తోంది. దేశవ్యాప్తంగా రబీ సీజన్‌ పూర్తయింది. వ్యవసాయోత్పత్తులు కోతలకు సిద్దంగా ఉన్నాయి. అయితే వ్యవసాయ కూలీల లభ్యత కొరవడింది. దీంతో వ్యవసాయ పనులు ముందుకు సాగడంలేదు. అసలే కూలీల కొరత, ఆపై కరోనా ప్రభావం ఇప్పుడు రైతుల్ని అతలాకుతలం చేస్తోంది. వ్యవసాయంలోకి యంత్రాలొచ్చినా అవి కొన్ని పనులకే పరిమితం. పనిచేసే కూలీల్లేకుండా యంత్రాల్తో మొత్తం సాగు పూర్తికాదు. ఈ దశలో ఉపాధి కోసం వందల కిలోమీటర్ల దరం నుంచి వ‌చ్చిన వలస కూలీల్ని ఎక్కడికక్కడ నిలుపుదల చేసి వాళ్ల‌ను వ్యవసాయ పనులకు మళ్ళించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవన్నీ నైపుణ్యంతో సంబంధంలేని పనులే. మాసుళ్ళు, కుప్పనూర్పిళ్ళు, ప్యాకింగ్‌ తరలింపు వంటి పనులన్నీ వలసకూలీలు చేయగలుగుతారు. ఇందుకు సంబంధించిన రోజువారి కూలీల్ని ప్రభుత్వమే నిర్దేశించాలి. ఇందులో కొంతమొత్తం రైతు ఇస్తే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా కూలీలకు చెల్లించాలి అంటూ పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: