ఇప్పుడు అంద‌రి దృష్టి...ఏప్రిల్ 14వ తేదీపైనే ఉంది. లాక్‌డౌన్ అమ‌లుపై కేంద్రం ఏ నిర్ణ‌యం తీసుకోనుందా అనే ఉత్కంఠే కొన‌సాగుతోంది. తాజాగా గురువారం అన్ని రాష్ర్టాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించి  దేశంలో కోవిడ్‌-19 పరిస్థితిపై ప్రధాని సమావేశంలో చర్చించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ భేటీలో పాల్గొన్నారు. అయితే, తాజాగా ప్ర‌ధాని మోదీ సామాన్యుల్లో మ‌రింత ఉత్కంఠ‌ను రేకెత్తిస్తున్నార‌ని అంటున్నారు. శుక్ర‌వారం ఉదయం 9 గంటలకు ప్రధాని మోడీ జాతిని ఉద్దేసించి ఓ చిన్న వీడియో సందేశాన్ని ఇవ్వబోతున్నారు. ఆ సందేశంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

 

వివిధ రాష్ర్టాల సీఎంలతో వీడియో కాన్ఫ‌రెన్స్ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స్పందిస్తూ...లాక్‌డౌన్‌ ముగిశాక ప్రజలంతా మూకుమ్మడిగా బయటకొచ్చే అవకాశం ఉందని ఇదే జరిగితే మరోసారి కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అన్నారు. దీన్ని అదిగమించేందుకు రాష్ర్టాలు, కేంద్రం సంయుక్తంగా పరిష్కార వ్యూహాన్ని రూపొందించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. ఢిల్లీ మర్కజ్‌ వెళ్లొచ్చిన వారి వివరాలు సేకరించాల‌ని కోరారు. కరోనా పాజిటివ్‌ కేసులు పెరగకుండా చర్యలను తీసుకోవాల‌న్నారు.

 

కాగా, దేశంలో కరోన బాధితుల సంఖ్య 1965కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 1764 మందికి చికిత్స కొనసాగుతోంద‌ని, ఇప్పటివరకు 150 మంది బాధితులు కోలుకున్నట్లు తెలిపారు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 50 మంది మృతి చెందిన‌ట్లు వెల్ల‌డించింది. క‌రోనా సంక్షోభం నేప‌థ్యంలో ఆయ‌న ఇప్ప‌టికే రెండు సార్లు జాతిని ఉద్దేశించి మాట్లాడారు.  ఇలాంటి త‌రుణంలో మ‌రోమారు ప్ర‌ధాని ఏం సందేశం ఇవ్వ‌నున్నారు అనే ఆస‌క్తి నెల‌కొంది. లాక్ డౌన్ అమలు చేస్తున్న సమయంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  కొన్ని చోట్ల ప్రజలు లాక్ డౌన్ విషయాన్ని పక్కన పెట్టి ప్రజలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు.  దీనిపై ప్ర‌ధాని ఘాటుగా స్పందిస్తారా అని చ‌ర్చ జ‌రుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: