కరోనా వికృత నాట్య శబ్ధానికి లోకంలో ఎన్ని శ్వాసలు ఆగిపోతున్నాయో తలచుకుంటే కన్నీరు ఆగడంలేదు కొందరికి.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10 లక్షలకు చేరువలో ఉంది. అయితే ఈ సంఖ్య వచ్చే నెల వరకు గవర్నమెంట్ సాలరీలా డబుల్‌ అయినా ఆశ్చర్య పోనక్కర్లేదు అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇక చైనా ఓ రాక్షస ప్రవృత్తి కలిగిన కరోనా అనే రోగాన్ని కని ప్రపంచం మీదికి వదిలింది.. ఇది హయిగా ప్రంపంచ దేశాలను సందర్శిస్తూ, ఇప్పటికే అమెరికా, ఇటలీ, స్పెయిన్‌ దేశాలను దాదాపుగా నాశనం పట్టించింది.. దీని కన్ను భారత్ పై పడింది.. అందువల్ల ఇక్కడ కూడా దీని ప్రభావం ప్రస్తుతం తీవ్రంగా కనిపిస్తుంది.

 

 

ఇకపోతే ఇండియాకు ఏప్రిల్‌ నెల చాలా కీలకంగా మారింది. ఈ సమయంలోనే లాక్‌డౌన్‌ అమలులో ఉన్నా కూడా నిజాముద్దీన్‌ ఘటన కారణంగా పెద్ద ఎత్తున పాజిటివ్‌ కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.. ఈ ప్రభావం ముందు ముందు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్బంలో ఒక సామాన్యుడు సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ ప్రస్తుతం అందరిని కలిచి వేస్తుంది. ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్న ప్రతి దేశంలోని పరిస్థితికి ఈ పోస్ట్‌ అద్దం పడుతుంది అంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అదేంటో చూస్తే..

 

 

మొన్నటి వరకు జీవితం ఎంతో సాఫీగా సాగిపోయింది. అప్పుడప్పుడు ఉరుకుల పరుగుల జీవితం అంటూ మనసుకు విసుగు వచ్చినా కూడా పని చేసుకుంటూ హాయిగా రోజులను గడిపాను. ఇప్పుడు చేసేందుకు పని లేదు, ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఇంట్లో కూర్చోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాని ఇంట్లో ఉన్న ప్రతి నిమిషం, ప్రతి గంట నా కుటుంబ పరిస్థితి ఏంటీ, రాబోయే రోజుల్లో నా కుటుంబ అవసరాలను ఎలా తీర్చాలి అనే టెన్షన్‌ నిదురపోనివ్వడం లేదు.. ఈ పరిస్థితుల్లో చిన్న పిల్లలు ఉన్న వారి దుస్దితి తల్చుకుంటే ఆందోళనకరంగా ఉంది. వారికి కావాల్సిన నిత్యావసరాలు కూడా సమయానికి అందని పరిస్థితి ఉంది.

 

 

ఇక లోకం పూర్తిగా తెలియని చిన్న పిల్లలు చేసే మారానికి సమాధానం చెప్పలేక, వారికి కావలసింది సమకూర్చలేక, బయటకు వెళ్దామని అల్లరి చేస్తూ ఉన్నా, వారిని ఇంట్లో నాలుగు గోడల బంధీలుగా మార్చి కనీసం పక్కింటి వారితో కూడా ఆడుకోనివ్వకుండా ఉంచాల్సి వస్తుంది. ఏం జరుగుతుందో అర్ధం కాని లేతమనసులపై ఈ ప్రభావం తీవ్రంగా పడుతుంది. అదీగాక ఎవరైన బయట తిరిగితే పోలీసులు కొట్టే వీడియోలు చూసి మరింతగా భయకంపితులు అవుతున్నారు. వార్తల్లో కరోనా గురించి వస్తున్న న్యూస్‌ చూసి భయంతో వణికి పోతున్నారు.

 

 

ఈ సమయంలో కొన్ని పుకార్లు మమ్ములను తీవ్రంగా భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్దితుల్లో ఏ వార్త నిజమో, ఏ వార్త అబద్దమో కూడా తెలియని పరిస్థితి. అయినా కూడా ముందు ఉన్నవి మంచి రోజులు అని భ్రమ పడుతూ కాలంతో పాటు సాగి పోతున్నాం.. నిజానికి దేవుడు అనేవాడు ఉంటే మళ్లీ జీవితంలో ఇలాంటి రోజులు చూడకుండా చేయాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్‌ చేశాడు... నిజమే కదా కరోనా వైరస్ అనే వార్తలతో నిండిపోయిన ఈ మెదళ్లకు, సమాజంలో సామాన్యుడు పడుతున్న కష్టాలు కూడా గుర్తుకు రావడం లేదు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: