దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించిన ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జ‌రిగిన‌ తబ్లిగీ జమాత్‌ సంస్థ నిర్వహించిన మత ప్రార్థనల్లో పాల్గొన్న వారి కార‌ణంగా వైర‌స్ వ్యాప్తి చెందిన వారి విష‌యంలో కేంద్రం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. మర్కజ్‌ మత ప్రార్థనల్లో పాల్గొని దేశంలోని అన్ని రాష్ర్టాలకు తిరిగి వెళ్లిపోయిన వారి వల్ల ఒక చైన్‌ లాగా కరోనా వ్యాప్తి చెందుతుందని ఈ నేప‌థ్యంలో... తబ్లీగీ జామాత్‌ కార్యక్రమానికి హాజరైన విదేశీయుల వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 960 మంది విదేశీయుల పాస్‌పోర్టులను కేంద్రం బ్లాక్‌ లిస్టులో పెట్టింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ కార్యాలయం తెలిపింది. పర్యాటక వీసాలపై వచ్చి తబ్లీగీ కార్యకలాపాలకు పాల్పడినట్లు కేంద్ర ప్రభుత్వ గుర్తించింది. విదేశీయుల చట్టం -1946, విపత్తు నిర్వహణ చట్టం - 2005ను ఉల్లంఘించినట్లు గుర్తించారు. 960 మంది విదేశీయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ర్టాలకు, రాష్ర్టాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. 

 

మ‌రోవైపు వివిధ రాష్ట్రాలు ఈ స‌మావేశాల‌కు హాజ‌రైన విష‌యంలో సీరియ‌స్‌గా స్పందిస్తున్నారు. ఈ స‌మావేశాల‌కు హాజ‌రైన వారిలో 46 మందిని గుర్తించామని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ తెలిపారు. 46 మందిని గోవాలో క్వారంటైన్‌కు తరలించామన్నారు. వీరిలో ఇతర రాష్ర్టాల వారున్నారు. వారు గోవాకు ఎందుకు వచ్చారనేది తెలియాల్సి ఉంది. వీరికి సంబంధించిన పూర్తి వివరాలు రేపటి వరకు వస్తాయి. గోవాలో ఇంకెవరైనా ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారున్నారో గుర్తించేందుకు అధికారులు, పోలీసులు పనిచేస్తున్నారని సీఎం ప్రమోద్‌ సావంత్‌ వెల్లడించారు. 

 

 

కాగా, ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో మర్కజ్‌ ప్రార్థనలకు హాజరైన వారు దేశంలో పలు రాష్ర్టాల్లో ఉండటంతో..అధికారులు వారి వివరాలను తెలుసుకుంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో వలసదారులు గుంపులు గుంపులుగా ఢిల్లీలోని మజ్నూ కా తిలా గురుద్వారాలో తలదాచుకున్నారు. స్థానిక అధికార యంత్రాంగం అనుమతి లేకుండా సామూహికంగా ఉండటంతో..పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. సుమారు 225 మంది వలసదారులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: