దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2069కు చేరింది. కరోనా భారీన పడి 53 మంది మృతి చెందారు. మొదట్లో దేశంలో కరోనా ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికీ తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో వారి కారణంగా వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య గత మూడు రోజుల నుంచి వేగంగా పెరుగుతోంది. 
 
తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి మన దేశం నుంచి 7600 మంది, విదేశాల నుంచి 1300 మంది హాజరయ్యారు. కేంద్రం ఈ కార్యక్రమం వల్ల దేశంలో కేసుల సంఖ్య పెరగడంతో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన విదేశీయుల వీసాలను కేంద్రం రద్దు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమానికి హాజరైన 960 మంది పాస్ పోర్టులను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన చేసింది. 
 
కేంద్రం ఈ కార్యక్రమానికి హాజరైన విదేశీయులు పర్యాటక వీసాలపై వచ్చినట్లు గుర్తించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. ఇప్పటివరకు ఈ సదస్సుకు హాజరైన వారిలో 400 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేంద్రం గుర్తించింది. విదేశీయులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరు కావడం వల్లే వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. 
 
దేశానికి పర్యాటక వీసాలపై వచ్చిన వారు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనటాన్ని కేంద్రం సీరియస్ గా పరిగణించింది. వీరు 1946 నాటి ఫారినర్స్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకూ 143 కేసులు నమోదు కాగా 110కి పైగా కేసులు ఈ కార్యక్రమానికి హాజరైన వారికే నిర్ధారణ అయినట్లు తేలింది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో మర్కజ్ ప్రభావం కొంత తక్కువగానే ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: