కరోనా వైరస్ విస్తృతి చెందుతోన్న నేపధ్యం లో రాజకీయాలను పక్కనపెట్టి   విపక్షాలు కట్టడికి, రాష్ట్ర ప్రభుత్వానికి  సహకరించాలి . తెలంగాణ లో విపక్షాలు ఈ అంశంపై పెద్దగా రాజకీయాలు చేస్తోన్న దాఖలాలైతే కన్పించడం లేదు . రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న చర్యలను  అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ లు  స్వాగతిస్తూనే, ఏమైనా లోపాలుంటే సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాయి . కరోనా కట్టడి లో భాగంగా లాక్ డౌన్ ప్రకటించడం తో , ఖజానాపై భారం పడడంతో ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది . నాల్గవ తరగతి , అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో కోత విధించడాన్ని కాంగ్రెస్ , బీజేపీ నేతలు తప్పుపట్టారు .

 

మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ , కార్పొరేషన్ల చైర్మన్లు , ఐఏఎస్ , ఐపీఎస్ ల జీతాల్లో కోతలు విధించడం పట్ల పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయని విపక్షాలు , నాల్గవ తరగతి , అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించకుండా అందజేయాలని కోరారు . కరోనా విస్తృతి నేపధ్యం లో  ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం అధికార, ప్రతిపక్షాల  మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి . కరోనా సహాయక చర్యల్లో పాల్గొనాల్సిన టీడీపీ నేతలు పాల్గొనకుండా , వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు గుప్పించి సోషల్ మీడియా లో నెటిజన్ల ట్రోల్స్ కు గురయ్యారు .

 

అయితే ఉద్యోగులకు రెండు విడతల జీతాలు చెల్లించడాన్ని కూడా తప్పుపట్టి టీడీపీ  నేతలు తప్పుపట్టడం ద్వారా , ప్రభుత్వం ఏదిచేసినా తప్పుపట్టాలన్న ఉద్దేశ్యమే కన్పిస్తోంది తప్పిస్తే , విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి సహకరించాలన్న దృక్పథమేదీ కన్పించడం లేదు . ఏపీ కంటే ఆర్ధికంగా మెరుగైన పరిస్థితుల్లో ఉన్న తెలంగాణతో జీతాల్లో కోత విధిచాలని నిర్ణయించగా , ఏపీ సర్కార్ రెండు విడతల్లో ఇవ్వాలని నిర్ణయించడం లో పెద్దగా తప్పుపట్టాల్సిన పని లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: