దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తూ ఉండటంతో ప్రధాని మోదీ మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో లాక్ డౌన్ అమలు వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోనున్నాయి. మరోవైపు మోదీ లాక్ డౌన్ ను పొడిగిస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ నిన్న సీఎంలతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో లాక్ డౌన్ గురించి స్పష్టత వచ్చింది. 
 
ఈ నెల 14వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పకడ్బందీగా అమలు కానుంది. ఆ తరువాత రాష్ట్రాలలో కరోనా కేసుల నమోదు, ఇతర పరిస్థితులను అంచనా వేసి దశల వారీగా లాక్ డౌన్ ను ఎత్తివేయనున్నారు. కొత్త కేసులు నమోదు కాని రాష్ట్రాలలో ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ అమలులో ఉండదని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఏప్రిల్ 14లోపు కరోనాను నియంత్రించడంతో ప్రభుత్వాలు సక్సెస్ అయితే లాక్ డౌన్ ను ఎత్తివేయనున్నారు. లేకపోతే కరోనా తీవ్రత తగ్గే వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. 
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విషయంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకోనున్నాయి. మోదీ నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకున్న చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాల గురించి ప్రధానంగా చర్చించారని సమాచారం. ప్రధాని ముఖ్యమంత్రులతో అంతర్జాతీయంగా ఈ వైరస్ పై పోరు ఆశాజనకంగా లేదని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. 
 
కొన్ని దేశాల్లో వైరస్ రెండోసారి విజృంభించే అవకాశాలు ఉన్నాయని చెప్పినట్టు సమాచారం. మోదీ ముఖ్యమంత్రులకు కరోనా రోగుల కోసం ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని సూచించారు. దేశంలో శాంతిభద్రతలు అదుపు తప్పకుండా చూడాలని... కరోనా మన జీవితాలను ప్రమాదంలోకి నెట్టేసిందని మోదీ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: