ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చారు. ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని కేవలం కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు మాత్రమే పరిమితం చేసింది. రెవిన్యూ శాఖ బియ్యం కార్డు జాబితా ఆధారంగానే ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త నిబంధనలను అమలు చేయడంతో రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య కోటీ 47 లక్షల నుంచి కోటీ 29 లక్షలకు తగ్గింది. 
 
రాష్ట్ర ప్రభుత్వం కొత్త బియ్యం కార్డులు జారీ చేసే సమయంలో ప్రభుత్వ పథకాలకు, ఆర్థిక సాయాలకు బియ్యం కార్డులను ప్రామాణికంగా తీసుకోబోమని ప్రకటన చేసింది. కానీ ఇప్పుడు ఆర్థిక సాయానికి వాటినే ప్రామాణికంగా తీసుకుంటోంది. ఫలితంగా రాష్ట్రంలో 18 లక్షల కుటుంబాలు నష్టపోనున్నాయి. ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా నిధులు విడుదల చేసింది. 
 
ప్రభుత్వం మూడు నెలల క్రితం గ్రామ, వార్డ్ వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేయించి కోటీ 29 లక్షల కుటుంబాలకు బియ్యం కార్డులు ఇచ్చింది. ఈ నెల నుంచి కొత్త రేషన్ కార్డుల ఆధారంగానే బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మార్చి 29న ప్రభుత్వం ప్రజలకు ఉచితంగానే బియ్యం, కందిపప్పు పంపిణీ చేసింది. 
 
ఏప్రిల్ 15, ఏప్రిల్ 29 తేదీలలో మరలా ప్రభుత్వం బియ్యం, కందిపప్పు ఉచితంగా పంపిణీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా పాత రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా ఆధారంగానే బియ్యం, కందిపప్పు పంపిణీ జరిగింది. అయితే ఆర్థిక సాయాన్ని మాత్రం ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జాబితా ఆధారంగా ఇవ్వనుంది. రేపు గ్రామ, వార్డు వాలంటీర్లు బియ్యం కార్డు ఉన్న కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: