ఏపీలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా బాధితుల సంఖ్య 161కు చేరింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల ముందు రాష్ట్రంలోని ఖజానాను ఖాళీ చేసిందని అన్నారు. చంద్రబాబు పెట్టిన బకాయిలన్నీ వైసీపీ ప్రభుత్వమే చెల్లించిందని చెప్పారు. సీఎం జగన్ లో చెప్పిన దాని కంటే ఎక్కువ చేయాలనే తాపత్రయం కనిపిస్తోందని తెలిపారు. 
 
సీఎం జగన్ కు ఉద్యోగుల జీతాలకు కోతలు పెట్టాలనే ఆలోచన ఏ మాత్రం లేదని అన్నారు. చంద్రబాబుకే కోతలు, వడబోతలు చెల్లిందని.... ఎల్లో మీడియా చంద్రబాబు వ్యాఖ్యలకు వత్తాసు పలుకుతోందని చెప్పారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఈ నెలలోనే వాయిదా పద్ధతిలో జీతాలు చెల్లించాలని నిర్ణయించామని ప్రకటన చేశారు. ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. 
 
నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. జమాత్ కు వెళ్లి వచ్చిన వారికి ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తయ్యాయని... ఢిల్లీ సదస్సుకు హాజరైన వారందరినీ గుర్తించడం జరిగిందని అన్నారు. కరోనా ప్రభావంతో రాష్ట్రంపై అదనపు భారం పడిందని చెప్పారు. ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలియజేశారని అన్నారు. 
 
రాష్ట్రంలో కరోనాను ఎదుర్కోవడానికి అత్యవసరమైన సర్వీసులకు మాత్రమే అనుమతిస్తున్నామని తెలిపారు. రాబోయే 15 రోజులు స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు సూచించారు. సామాజిక దూరం పాటిస్తే మాత్రమే కరోనాను నియంత్రించగలమని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కోటీ 28 లక్షల ఇళ్లల్లో సర్వే చేయించామని అన్నారు. రాష్ట్రంలో దగ్గు, గొంతునొప్పి లక్షణాలను గురించి వైద్యుల సలహా మేరకు వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: