ఏప్రిల్ 2వ తేదీ గురువారం అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే అత్యంత బాధాకరమైన రోజుగా చరిత్రలో నిలిచిపోతుంది. ప్రపంచదేశాలను వణికించేస్తున్న కరోనా వైరస్ అమెరికాపై తీవ్రస్ధాయిలోనే విరుచుకుపడింది. వైరస్ దెబ్బకు రాష్ట్రాలకు రాష్ట్రాలే అల్లాడిపోతున్నాయి. దేశం మొత్తం మీద గురువారం నాడు వైరస్ దెబ్బకు 1170 మంది చనిపోయారు. మామూలుగా అమెరికా మనస్తత్వం ఎలాగుంటుందంటే ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు తాము మాత్రం బాగుంటే చాలన్నట్లుగా ఉంటుంది.

 

అలాంటి అమెరికాయే వైరస్ దెబ్బకు తల్లకిందులైపోతోంది. మందు లేని వైరస్ కావటంతో  ఏమి చేయలేక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే స్వయంగా చేతులెత్తేశాడు. అమెరికాను దేవుడే రక్షించాలని ప్రకటించాడంటేనే పరిస్ధితి ఎంత భయంకరంగా ఉందో అర్ధమూపైపోతోంది. దేశం మొత్తం మీద సమస్య ఎక్కువగా న్యూయార్క్ లోనే ఉంది. దేశంలోని 2.5 లక్షల  వైరస్ బాధితుల్లో ఒక్క న్యూయార్క్ లో మాత్రమే 95 వేలమంది ఉన్నారంటే అక్కడి పరిస్ధితిని ఎవరికి వారుగా ఊహించుకోవచ్చు.

 

వైరస్ విషయంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహించింది. దానికితోడు జనాలు కూడా వైరస్ ను పెద్దగా లెక్క చేయలేదు. పైగా న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాల్లో చైనా వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. చైనాతో పాటు ఇటలీ, స్పెయిన, ఇరాన్ దేశాల్లో వైరస్ బాధితులు పెరుగుతున్నా తమకేమీ కాదులెమ్మని అమెరికా ప్రభుత్వం మందు జాగ్రత్తలు తీసుకోకపోవటమే ఇపుడు కొంప ముంచేసింది.  చివరకు మేల్కొనే సమయానికే జరగాల్సి నష్టం బాగా జరిగిపోయింది.

 

మొత్తం 50 రాష్ట్రాలకు గాను 27 రాష్ట్రాల్లో వైరస్ బాధితుల సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయి.  శనివారానికి న్యూయార్క్ లో మాత్రమే బాధితుల సంఖ్య లక్షదాటినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ 2600 మంది చనిపోయారు. న్యూజెర్సీలో 25 వేల కేసులు నమోదైతే 550 మంది చనిపోయారు.

 

కాలిఫోర్నియాలో 11 వేలు, మిషిగాన్ లో 10 వేల కేసులు నమోదయ్యాయి. లూసియానా, ఫ్లోరిడా, మసాచుసెట్స్, ఇల్లినాయిస్, పెన్సిల్వేనియా, వాషింగ్టన్ రాష్ట్రాల్లో కూడా బాధితుల సంఖ్య పదివేలు దాటేశాయి. అమెరికా మొత్తం మీద సుమారు 2.5 లక్షల మంది చనిపోతారని ఉన్నతాధికారులే ప్రకటిస్తున్నారంటే పరిస్ధితి ఎలాగుందో అర్ధం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: