ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న కొవిడ్‌-19 క‌ట్ట‌డికి సామాజిక దూరం పాటించ‌డ‌మే ప్ర‌స్తుతం మ‌న చేతిలో ఉన్న ఆయుధ‌మ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. అన్ని దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న ఈ మ‌హ‌మ్మారిని సామాజిక దూరంతోనే మ‌న నుంచి దూరంగా పంప‌వ‌చ్చున‌ని పేర్కొంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా బీభ‌త్సం సృష్టిస్తోంది. అగ్ర‌దేశాల‌న్నీ దీని బారిన ప‌డి విల‌విలాడుతున్నాయి. ఏం చేయాలో, ఎలా క‌ట్ట‌డి చేయాలో తెలియ‌క బిక్కుబిక్కుమంటున్నాయి. అన్నిరంగాలు తీవ్ర‌స్థాయిలో దెబ్బ‌తింటున్నాయి. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కుప్ప‌కూలుతున్నాయి. ఇప్ప‌టికే దీని బారిన సుమారు ప‌దిల‌క్ష‌ల మందికిపైగా ప‌డ్డారు. ఇక మ‌ర‌ణాల సంఖ్య ఏకంగా సుమారు 53వేల‌కు పైగా ఉన్న‌ట్లు అంత‌ర్జాతీయ మీడియా వెల్ల‌డిస్తోంది. అయితే.. దీనిని క‌ట్ట‌డి చేయాడానికి, దీనిని మ‌న నుంచి త‌రిమికొట్ట‌డానికి ప్ర‌స్తుతం ఉన్న ఏకైక ఆయుధం సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డ‌మేన‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. ప్ర‌స్తుతం క‌రోనాకు ఎలాంటి మందులేదు. వ్యాక్సిన్‌ను క‌నిపెట్టే ప‌నిలో అన్నిదేశాల ప‌రిశోధ‌కులు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నారు. 

 

ఇదే స‌మ‌యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌లు వైర‌స్ వ్యాప్తికి సంబంధించి ప‌లు కీల‌క అంశాల‌ను కూడా వెల్ల‌డించింది. ఇది ఒక‌రి నుంచి మ‌రొక‌రికి ఎలా సంక్ర‌మిస్తుందో చెప్పింది. కొవిడ్‌-19 రోగి ద‌గ్గిన‌ప్పుడు లేదా తుమ్మిన‌ప్పుడు నోటి నుంచి వెలువడే తుంపరల ద్వారా మరొకరికి సంక్రమిస్తుందని, గాలి ద్వారా వ్యాప్తి చెందదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల రోగి దగ్గినప్పుడు వెలువడే తుంపరల ద్వారా ఇతరులకు వైర‌స్ సంక్ర‌మిస్తుంద‌ని ఓ నివేదికలో పేర్కొంది. ఈ వైరస్‌ బారిన పడిన వ్యక్తి దగ్గడం లేదా తమ్మిన సందర్భంలో ఒక మీటర్‌ దూరంలో ఉన్న వ్యక్తిపై ఆ తుంపరలు పడితే అవి నోరు, ముక్కు, కళ్ల ద్వారా మరొకరి శరీరంలో చేరి కొవిడ్‌-19 బారిన ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని తెలిపింది. అలాగే,  వైరస్‌ సోకిన వ్యక్తి వాడిన వస్తువులను, ఉపరితలాలను తాకడం వ‌ల్ల‌ కూడా ఈ వైర‌స్‌ ఇతరులకు సంక్రమిస్తుందని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో మ‌న చేతుల‌ను తరచూ శుభ్రపరుచుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా ఈ మహమ్మారిని దూరం పెట్టవచ్చని డ‌బ్ల్యూహెచ్‌వో సూచించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: