దేశంలో క‌రోనా ప్ర‌భావం రోజురోజుకూ ఎక్కువ అవుతోంది. కొవిడ్‌-19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. వైర‌స్‌బారిన ప‌డి మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా క్ర‌మంగా పెరుగుతోంది. అయితే.. గ‌డిచిన 24గంట‌ల్లో( ఏప్రిల్ 3 రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు) ఏకంగా478 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని, 12 మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌ని కేంద్ర‌, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. అలాగే.. గత రెండు రోజులలో 14 రాష్ట్రాల నుంచి కనీసం 647 కొవిడ్‌-19 కేసులు న‌మోదు అయ్యాయి. మొత్తంగా 62 మంది మృతి చెందారు. ఈ కేసుల‌లో ఎక్కువ‌గా ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జ‌రిగిన త‌బ్లిఘి జ‌మాత్‌కు చెందిన‌వే కావ‌డం గ‌మ‌నార్హం. అలాగే.. మార్చి నెలాఖ‌రులో మ‌ర్క‌జ్ జ‌మాత్‌ను ఖాళీ చేయించ‌డంలో పాల్గొన్న ఏడుగురు ఢిల్లీ పోలీసులు కూడా క్వారంటైన్లో ఉన్నారు. మ‌ర్క‌జ్ ఉదంతంతో దేశ‌వ్యాప్తంగా కొవిడ్‌-19 పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతోంది. దాదాపుగా మెజార్టీ రాష్ట్రాల్లో మ‌ర్క‌జ్ ప్ర‌భావం క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో జిల్లా కేంద్రాల‌తోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. 


అలాగే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 55 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఇది ఏపీలో తొలి క‌రోనా బాధితుడి మ‌ర‌ణం కావ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ధ్రువీక‌రించింది. త‌బ్లిఘి జ‌మాత‌కు హాజ‌రైన కొడుకు నుంచి అత‌డి తండ్రికి ఈ వైర‌స్ సోకింది. ప్ర‌స్తుతం ఏపీలో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు 161 కేసులు న‌మోదు అయ్యాయి. త‌బ్లిఘి జ‌మాత్ త‌ర్వాత దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య న‌మోదులో వేగం పెరిగింద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. ఏప్రిల్ నెలాఖ‌రు వ‌ర‌కు క‌రోనా ప్ర‌భావం మ‌రింత పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. అమెరికా, స్పెయిన్‌, ఇట‌లీ, చైనా, ఇరాన్ ఫ్రాన్స్ త‌దిత‌ర దేశాల్లో క‌రోనా తీవ్ర  ప్ర‌భావం చూపుతోంది. ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు క‌రోనా బారిన ప‌డ్డారు. సుమారు ప్ర‌పంచ వ్యాప్తంగా సుమారు 10ల‌క్ష‌ల మందికిపైగా క‌రోనా బారిన ప‌డ్డారు. ఇక క‌రోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్య సుమారు 53వేల‌కుపైగా ఉంది. మున్ముందు ఈ సంఖ్య మ‌రింత‌గా పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: