ఏపీలో క‌రోనా విస్తృతి పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఒక్క‌సారిగా పెరుగుతున్న నేప‌థ్యంలో ఏపీలోని ప‌రిస్థితిపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. రాష్ట్రంలో ఏం జ‌రుగుతోంది? ఎందుకు ఇన్ని క‌రోనా కేసులు అంటూ ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో తాడేపల్లిలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌ కరోనా పరిస్థితిపై ఉన్నత సమీక్ష చేసిన వివ‌రాల‌ను వెల్ల‌డించారు. 13 జిల్లాల్లో 161 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని పేర్కొన్న మంత్రి ఇందులో 140 మంది ఢిల్లీ నుంచి వచ్చిన వారేన‌ని షాకింగ్ విష‌యం తెలిపారు.

 


1085 మంది ఢిల్లీ నుంచి వచ్చార‌ని, 946 మంది రాష్ట్రంలో ఉన్నారు 139 మంది మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. వీరిలో 881 మంది గుర్తించి టెస్ట్ చేశామ‌ని 108 మందికి పాజిటివ్ వచ్చిందని వివ‌రించారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారికి కాంటాక్ట్ అయిన వారిలో 32 మందికి క‌రోనా పాజిటివ్ వచ్చింద‌ని మంత్రి తెలిపారు. 1.45 కోట్ల కుటుంబాలలో 1.28 కోట్ల కుటుంబాల సర్వే పూర్తి అయిందని మంత్రి నాని వివ‌రించారు. ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన‌ లాబ్స్ కూడా పెంచాలని సీఎం ఆదేశించార‌ని దీంతో గుంటూరు, కడపలో అదనంగా ల్యాబ్‌ ఏర్పాటు చేశామ‌ని వెల్ల‌డించారు. విశాఖలో మరో లాబ్ సోమవారం అందుబాటులోకి వస్తుందని మంత్రి వివ‌రించారు. ఇప్పుడున్న వాటి ద్వారా 500 మందికి టెస్ట్ చేయవచ్చున‌ని, కొత్త వాటితో 900 టెస్టులు చేయవచ్చున‌ని మంత్రి ఆళ్ల నాని తెలియ‌జేశారు. ప్రైవేట్ లాబ్స్ కూడా పరిశీలించమని సీఎం చెప్పారని మంత్రి పేర్కొన్నారు. 

 

వివిధ జాగ్ర‌త్త‌ల గురించి తెలియ‌జేస్తూ దుకాణాల వద్ద రంగులతో శాశ్వత మార్కింగ్ చేయాలని, షాపుల‌ వద్ద నిత్యావసర వస్తువుల ధరల పట్టిక పెద్ద అక్షరాలతో ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారని మంత్రి నాని వివ‌రించారు. వలస కూలీల కోసం 236 క్యాంపులు నడుపుతున్నామ‌ని, దీనికి ప్రత్యేక అధికారులను కూడా నియమించామ‌న్నారు. ఈ క్యాంపుల‌లో 78 వేల మంది ఉంటే 16 వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం వసతులు ఇస్తుండ‌గా...మిగిలిన వారికి ఆయా సంస్థలు సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. క్యాంపులో ఉన్నవారికి అక్కడే రేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకున్నామ‌ని అన్నారు. ఏ ఒక్కరు ఆకలితో ఉండకూడదని సీఎం స్పష్టంగా చెప్పారని మంత్రి వెల్ల‌డించారు. ప్రభుత్వం ఇవ్వనున్న 1000 రూపాయలు రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్న  వారికి కూడా ఇవ్వాలని సీఎం చెప్పారని మంత్రి వెల్ల‌డించారు. కాగా, రేష‌న్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి సైతం రూ. 1000 ఇవ్వాల‌నే ప్ర‌భుత్వం నిర్ణ‌యంపై ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మవుతున్నాయి. సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని ప‌లువురు కొనియాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: