కరోనాపై యుద్ధంలో భారతీయులంతా గెలుస్తారని ధీమా వ్యక్తం చేయడంతోపాటు మరోసారి దేశ పౌరులంతా కరోనాను తరిమికొట్టేందుకు వ‌చ్చే ఆదివారం ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ న‌డిచింది. ప్ర‌ధానంగా టీఆర్ఎస్ సానుభూతిప‌రులు ఈ నిర్ణ‌యంపై ప‌లు కామెంట్లు చేశారు. అయితే, వారికి షాకిచ్చేలా టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ‌ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 5 నెల రాత్రి 9 గంటలకు రాష్ట్ర ప్రజలంతా దీపాలు వెలిగించాలని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.


క‌రోనాపై పోరుకు సంఘీభావ సంకేతంగా ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్ తెలంగాణ‌ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.  మానవజాతి తనకు పట్టిన పీడపై చేస్తోన్న గొప్ప పోరాటం స్ఫూర్తివంతంగా సాగాలని సీఎం కేసీఆర్‌  ఆకాంక్షించారు. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ సానుభూతిప‌రులంతా దీపాల వెలిగింపు ప్ర‌క్రియ‌పై మునుప‌టి వ‌లే ట్రోలింగ్ చేయ‌లేని ప‌రిస్థితి ఉంద‌ని ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలాఉండగా, ఒక్కమాటపై నడుస్తున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన కేసీఆర్​, వైఎస్​ జగన్​ల దోస్తీలో... కేసీఆర్​ ప్రధాని మోదీ మాటకు జై కొట్టగా జగన్​ ఏం చేయనున్నారనే ప్రశ్న ఎదురయింది.


ఇదే సమ‌యంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. చెడు మీద మంచి... చీకటి మీద వెలుతురు గెలవాలని... అలాగే కరోనా మీద చేస్తున్న పోరాటంలో మానవాళి విజయం సాధించాలని  అభిలషించారు. కరోనా మీద చేస్తున్న పోరాటంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, రాష్ట్రాలకు అతీతంగా... మనమంతా ఒక్కటేనని, మన శత్రువు కరోనా అని చాటి చెపుతూ భారతీయులంతా ఏకమవువుదామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ళ ముంగిట దివ్వెలను, సెల్‌ఫోన్‌ లైట్లను వెలిగించి... భారతీయులంతా ఒక్క తాటిమీదకు రావాలన్న  ప్రధాని పిలుపునకు మద్దతు పలకాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు.

 


కాగా, కాంగ్రెస్ సీనియ‌ర్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధురి మాత్రం సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 5న దేశవ్యాప్తంగా ప్రజలు లైట్లు ఆఫ్‌ చేసి, కొవ్వత్తులు వెలిగించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును తాను వ్యతిరేకిస్తున్నాని, దాన్ని పాటించనని చౌధురి తేల్చి చెప్పారు. అసలు కరోనాపై పోరుకు, లైట్లు బంద్‌ చేసి క్యాండిళ్లు, టార్చ్‌లు వెలిగించడానికి ఏ మాత్రం సంబంధం లేదని ఆయన ప్ర‌శ్నించారు. ‘నేను లైట్లు బంద్‌ చేయను, క్యాండిళ్లు వెలిగించను, కానీ కరోనాపై పోరాటాన్ని కొనసాగిస్తానని అన్నారు. అలా చేస్తే తనపై జాతి వ్యతిరేకి అనే ముద్ర వేస్తారని, దానికి నేను సిద్ధంగా ఉన్నా’అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: