ఏపీలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో నిన్న 15 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 164కు చేరింది. వైద్య, ఆరోగ్య శాఖ నిన్న రాత్రి ఈ మేరకు ప్రకటన చేసింది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఎక్కువమంది ఢిల్లీ మత ప్రార్థనలకు హాజరైన వారు కావడం గమనార్హం. నిన్న విశాఖలో ఒక పాజిటివ్ కేసు నమోదు కాగా తూర్పు గోదావరి జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. 
 
ప్రధాని మోదీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉండడంతో ఏపీలో పెన్షన్ తీసుకోవాల్సిన లబ్ధిదారులు చాలామంది ఇతర ప్రాంతాలలో ఉండిపోయారు. లాక్ డౌన్ వల్ల పెన్షన్ అందని వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం వాళ్లకు వచ్చే నెలలో ఒకేసారి రెండు నెలల పెన్షన్ ను అందజేస్తామని ప్రకటన చేసింది. 
 
ప్రభుత్వం లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వేలిముద్రలు, సంతకాలు, ఐరిస్ లేకుండానే పెన్షన్లను పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 32 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా, గుంటూరు, కడప జిల్లాలు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. 
 
రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఇప్పటివరకూ కరోనా కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో నిన్న విజయవాడలో కరోనా తొలి మరణం నమోదైంది. ఇప్పటివరకూ నలుగురు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో గత మూడు రోజులుగా భారీగా కేసులు నమోదు కాగా నిన్న కొత్త కేసుల సంఖ్య తగ్గడం గమనార్హం. మరోవైపు తెలంగాణలో నిన్న ఒక్కరోజే 75 కరోనా కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 229కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: