తెలుగులో ’క్షవరమైతే కానీ వివరం తెలీద’నే సామెతొకటుంది. అమెరికా అధ్యక్షడు ట్రంప్ వ్యవహారం కూడా చూడబోతే అలాగే ఉంది. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడిపోవవటం ఒక ఎత్తైతే అగ్రరాజ్యం అమెరికా అల్లాడి పోవటం మరో ఎత్తుగా ఉంది. ఎందుకంటే ప్రపంచదేశాలన్నింటిలో కలిపి 10 లక్షల మంది బాధితులుంటే అమెరికాలో మాత్రమే 2.80 వేల మందున్నారు. మొత్తం మీద సుమారుగా 60 వేల మంది చనిపోతే అమెరికాలో మాత్రమే దాదాపు 8 వేల మంది మృతి చెందారు.

 

పై ఫిగర్లు బట్టే అమెరికా ఎంతటి సంక్షోభంలో ఉందో అర్ధమైపోతోంది. దాంతో   అధ్యక్షుడు డొనాల్డ్ జె ట్రంప్ కు ఇప్పటికి బుద్ధి వచ్చినట్లుంది. అందుకే అమెరికన్లంతా మరో నాలుగు వారాల పాటు ఇళ్ళల్లో నుండి బయటకు రావద్దంటూ తాజాగా పిలుపిచ్చాడు. మందు లేని ఈ వైరస్ కు సోషల్ డిస్టెన్సింగ్, లాక్ డౌన్ కు మించిన మందు మరొకటి లేదని చెప్పటమే విచిత్రంగా ఉంది. అయితే ట్రంప్ వ్యాఖ్యలతో విభేదించిన కొన్ని రాష్ట్రాలు మాత్రం లాక్ డౌన్ ను ప్రకటించేశాయి.

 

దాదాపు 20 రోజుల క్రితమే అమెరికాలో లాక్ డౌన్ ప్రకటించాలని డిమాండ్లు వచ్చినపుడు ట్రంప్ పట్టించుకోలేదు. పైగా అమెరికాలో లాక్ డౌన్ ప్రకటించేది లేదని స్పష్టంగా చెప్సేశాడు. లాక్ డౌన్ ప్రకటిస్తే ఆర్ధికమాంధ్యం తలెత్తుతుందని దాన్ని తట్టుకోవటం కష్టమంటూ చాలా కథలే చెప్పాడు. అసలు మనుషులంటూ ఉంటేనే కాదా ఏ మాంధ్యమైనా అనే ఆలోచన అప్పుడు రాలేదు. ఎంతమంది వివరించినా అప్పట్లో ట్రంప్ చాలా మొండిగా వ్యవహరించాడు.

 

తీరా ఇపుడు బాధితుల సంఖ్య లక్షల్లోకి మరణాల సంఖ్య వేలల్లోకి వెళిపోతున్న సమయంలో జనాల్లో ట్రంప్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చేస్తోంది. అదే సమయంలో ప్రపంచ దేశాలు కూడా ట్రంప్ వైఖరిని తీవ్రంగా తప్పు పడుతున్నాయి. దాంతో అన్నీ కోణాల నుండి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక చివరకు లాక్ డౌన్ అని ప్రకటించకుండానే నాలుగు వారాల పాటు అందరూ ఇళ్ళకే పరిమితమవ్వాలంటూ పిలుపిచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: