మహారాష్ట్రలోని ముంబై లో కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరిగిపోతుంది. ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచమంతటా లాక్ డౌన్ ఎత్తేసినా... మహారాష్ట్రలో అది జరగబోదని కొంతమంది రాజకీయ వేత్తలు చెబుతున్నారు. మహారాష్ట్రలో 490 కేసులు నమోదు కాగా... అందులోని 278 కేసులు ముంబై నగరంలో నమోదు అయినవే. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల కంటే ముంబై నగరానికి చెందిన చాలామంది తబ్లీజీ జమాత్ వేడుకలో పాల్గొన్నారు. అయితే వీరి నమూనాలను సేకరించి వైద్య పరీక్షలు చేయగా... మొన్న ఒక్కరోజే 63 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా... వారిలో 57 మంది ముంబైకి చెందిన వారేనని నిర్ధారణ అయ్యింది. అలాగే గురువారం రోజు మహారాష్ట్రలో ఆరుగురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోగా... వారిలోని నలుగురు ముంబైకి చెందిన వారే.


ఈ గణాంకాలను బట్టి చూస్తుంటే మహారాష్ట్రలోని ముంబై నగరంలో కరోనా తీవ్రత ఎంత అధికస్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. కోవిడ్ 19 వ్యాధి కారణంగా ధారవిలో ఓ 67 ఏళ్ల వ్యక్తి మరణించాడు. అయితే మృతుడు తబ్లీజీ జమాత్ వేడుకలో పాల్గొన్న వారితో కాంటాక్ట్ లో ఉన్నాడని తేలింది. ఈయనకి ఆల్రెడీ బిపి, షుగర్, గుండె సంబంధిత రుగ్మతలు ఉన్నాయి. దాంతో కరోనా దెబ్బకి తాను తట్టుకోలేక ప్రాణాలు విడిచాడు. ఈ విధంగా గత నాలుగు రోజులుగా కరోనా మరణాలు, పాజిటివ్ కేసులు ఎక్కువగా పెరిగిపోతుండడంతో... అక్కడి యంత్రాంగం లాక్ డౌన్ ఇంకా ఎక్కువ రోజుల పాటు కొనసాగించాలని భావిస్తోంది.


లాక్ డౌన్ ఇంకా దాదాపు పది రోజులు కొనసాగనుంది కాబట్టి... అప్పటి పరిస్థితులను పరిశీలించి... ఆ తరువాత లాక్ డౌన్ కొనసాగించాలో ఎత్తివేయాలో నిర్ణయించుకుంటామని మహా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. మరి ఏప్రిల్ 14తేదీన కరోనా ప్రభావం మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా ఉంటుందో చూడాలిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: