పది నుంచి పదిహేను ఏళ్లు... ఇది పిల్లలు ఎదిగే వయసు. ఈ దశలో పిల్లల ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. పిల్లల ఎదుగుదల ఏడాది వయసు వేగంగా ఉండి, పదేళ్లు చేరుకునేవరకూ నెమ్మదిస్తుంది. పదో ఏట నుంచి తిరిగి వేగం పుంజుకుంటుంది. కాబట్టి ఈ వయసు నుంచి పిల్లలకు ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దశలో పిల్లలకు బలవర్ధకమైన ఆహారం ఇస్తే మంచి ఎత్తు పెరుగుతారు, బలంగా తయారవుతారు. 

 


ఆడపిల్లలు  విషయంలో  కూడా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఎదిగి గర్భం దాల్చినప్పుడు, పిల్లలకు పాలిచ్చే సమయానికి ఎలాంటి బలహీనతలూ, ఆరోగ్య సమస్యలూ రాకుండా ఉండాలంటే పదేళ్ల వయసు నుంచే మాంసకృత్తులు ఉన్న ఆహారం ఇవ్వాలి. ఇప్పుడు పిల్లలు తినే ఆహారంలో ప్రొటీన్లు తక్కువ పిండి పదార్థాలు, కొవ్వులు ఎక్కువ ఉంటున్నాయి. ఇలాంటి ఆహారం తినటం వల్ల పిల్లల్లో వయసుకు తగిన పెరుగుదల ఉండదు. అధిక బరువు, హార్మోన్లలో మార్పుల లాంటి సమస్యలు పదేళ్ల వయసు నుంచే మొదలవుతాయి. కాబట్టి ఈ వయసు నుంచే సమతులాహారం ఇస్తూ ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోగలిగితే భవిష్యత్తులో హైపర్‌టెన్షన్‌, మధుమేహం, రక్తపోటు మొదలైన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. 

 


కొంతమంది పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు, స్వీట్లు, చీజ్‌, ఉప్పు, మైదాతో చేసిన పదార్థాలను ఏరికోరి తింటూ ఉంటారు. వాళ్ల శరీర జీవక్రియలకు తగినన్ని పోషకాలు శరీరానికి అందకపోవటమే ఇలాంటి ఫుడ్‌ క్రేవింగ్స్‌కు (ఆహార వ్యసనాలు) కారణం. కాబట్టి ఈ వయసులో పిల్లలకు ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్న సమతులాహారం ఇవ్వాలి. ఇందుకోసం... ఈ కింది పదార్థాలు ఇవ్వాలి.గుడ్లు, ఆకుకూరలు, తాజా పళ్లు, కూరగాయలు, బాదం, వాల్‌నట్స్‌, వేరుసెనగలు, గోధుమలు, పెసలు, పాలు, వెన్న, పెరుగు, మాంసం, చేపలు, జున్ను, రాజ్మా, సెనగలు, బొబ్బర్లు లాంటి పోషకాలు కలిగిన ఆహారం ఇవ్వాలి. 


పిల్లలకు సాయంత్రం అల్పాహారంగా బాదం, పిస్తా, వాల్‌నట్స్‌, ఉడకబెట్టిన సెనగలు, మొక్కజొన్నలాంటివి ఇస్తే జంక్‌ ఫుడ్స్‌ మీదకు మనసు మళ్లకుండా ఉంటుంది. పిల్లలు జంక్‌ఫుడ్‌ కి అలవాటు పడిన తర్వాత వాళ్ల ఆహారంలో మార్పులు చేయటం కాకుండా అంతకంటే ముందే ఇలాంటి ఆహార నియమాలను వాళ్లకు అలవాటు చేయగలిగితే జంక్‌ ఫుడ్‌కి అలవాటు పడకుండా ఉంటారు.తగినంత పీచు పదార్థం ఉండేలా చూసుకుంటే ప్రొటీన్‌ ఫుడ్‌ వల్ల మలబద్ధకం తలెత్తకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: