లోకంలో మానవత్వం, మంచితనం నశించిపోయింది అనడానికి ఉదహరణగా ఎన్నో సంఘటనలు నిత్యం కళ్ల ముందు కదులుతున్నాయి.. జీవితం విలువైంది అనే విషయాన్ని మరచిన మూర్ఖులు కొందరు.. చేజేతులారా వారు చెడిపోతున్నది గాక, సమాజానికి చీడపురుగుల్లా మారుతున్నారు అసలే కరోనా అనే పురుగుతో ప్రపంచం అల్లాడిపోతు ఎలా బ్రతకాలిరా దేవుడా అని కన్నీళ్ల పర్యంతం అవుతుంటే, అదేమి పట్టనట్లుగా ప్రవర్తిస్తున్నారు..

 

 

ఇకపోతే ఈ కరోనా వచ్చుడు ఏందో గాని దీని వల్ల కొందరు ఖైదీలకు మాత్రం స్వేచ్చ దొరికింది.. ఇలాంటి వారు బ్రతుకు జీవుడా అని అనుకోవాలి కానీ తిరిగి వారిలోని రాక్షస ప్రవృత్తిని మరచిపోలేక మళ్లీ నేరాలు చేస్తున్నారు.. ఇకపోతే కరోనా కట్టడిలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొందరు ఖైదీలను పెరోల్‌పై విడుదల చేసింది. అలా విడుదలైన ఓ ఖైదీ శనివారం ఓ కానిస్టేబుల్ భార్యను పొడిచి చంపాడు. ఆ వివరాలు చూస్తే..

 

 

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జైలునుండి విడుదల అయిన నవీన్ గొటాఫోడ్ (27) అనే ఖైదీ  ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో తన స్నేహితుడైన శివను కలిసేందుకు అతని ఇంటికి వెళ్లాడు.. ఇతను కానిస్టేబుల్ అశోక్ మూలే కుమారుడు.. కాగా శివ తల్లి సుశీల (52) తన కొడుకును కలవడానికి వచ్చిన నిందితుడికి అభ్యంతరం తెలిపింది.. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు నవీన్ తనవెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడిచేశాడు. ఇది గమనించిన ఆమె కుమారుడు శివ నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, రాక్షసుడిగా మారిన నవీన్ అతడిపై కూడా దాడి చేసి అక్కడినుండి పారిపోయాడు...

 

 

వెంటనే చుట్టుపక్కల వారి సహాయంతో రక్తపు మడుగులో కుప్పకూలిన సుశీలను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కాగా నిందితుడైన నవీన్ వాహనల దొంగతనం కేసులో అరెస్టై జైలుకు వెళ్లగా, ఇటీవల పెరోల్‌పై బయటకు వచ్చి ఇలా చేశాడు.. ఇప్పటికే నవీన్ పై ఓ మర్డర్ కేసు కూడా ఉందని జాయింట్ కమిషనర్ రవీంద్ర కదమ్ తెలిపారు. ఇదిలా ఉండగా ఒక  కానిస్టేబుల్ కుమారుడికి, కరడుగట్టిన నేరస్తుడితో పరిచయం ఉండటం ఏంటనే అనుమానం వస్తుండగా వీరి స్నేహం పై దర్యాప్తు చేస్తున్నట్టు సీపీ తెలిపారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: