తెలంగాణ లో కరోనా బాధితుల సంఖ్య  ను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించి చెబుతోందన్న ఊహాగానాలు వినిపిస్తోన్న నేపధ్యం లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు . ఇంత సంకుచిత ధోరణి సరికాదని , ఎందుకలా  చెబుతామని ఆయన ఎదురు  ప్రశ్నించారు . తాము ఏ విషయాన్ని  కూడా దాయాల్సిన అవసరం లేదన్న ఈటల  , ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నామని చెప్పారు . ఈ విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు తగదని విపక్షాలకు  హితవు పలికిన ఆయన , ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు  .

 

 కరోనా కట్టడికి కేంద్రం సహకరిస్తోందా ? అని ఇటీవల తనను ఒక పత్రిక ప్రతినిధి ప్రశ్నించారని చెప్పారు. కేంద్రం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైన ఈ సమయం లో కరోనా కట్టడికి కృషి చేస్తున్నాయని  చెప్పానని , తాము ఇతరుల మాదిరిగా  సంకుచిత ధోరణితో ఆలోచించడం లేదని సదరు పత్రిక ప్రతినిధికి  వివరించానని చెప్పుకొచ్చారు  . రాష్ట్రం లో కరోనా కట్టడికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని , కరోనా ఫ్రీ తెలంగాణయే తమ లక్ష్యమని వెల్లడించారు . తెలంగాణ నుంచి త్వరలోనే  కరోనా మహమ్మారి మాయం కావడం ఖాయమన్న ఆయన ,  ప్రయివేట్ ల్యాబ్ లకు కరోనా పరీక్షలు చేసే అవకాశం ఇచ్చేదిలేదని  ఈటల రాజేందర్ స్పష్టం చేశారు  .

 

ఒకవేళ తాము ప్రయివేట్ ల్యాబ్ లకు అనుమతిస్తే , వారే పరీక్షలు చేసే కిట్స్ పట్టుకుపోయే ప్రమాదముందని అన్నారు . అందుకే ప్రభుత్వపరంగానే కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు . ప్రతీ రోజు వెయ్యి మందికి కరోనా  పరీక్షలు చేసే సామర్ధ్యం ఉందన్న  ఈటల రాజేందర్, రానున్న రోజుల్లో మరింత సామర్ధ్యం పెంచుకునే అవకాశం ఉన్నదన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఇప్పటికే పలువురు డిశ్చార్జీ  అయిన విషయం తెల్సిందేనని పేర్కొన్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: