ప్ర‌పంచ‌వ్యాప్తంగా కరోనా మహమ్మారి క‌ల‌క‌లం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వ‌ల్ల మనుషుల ఆరోగ్యంపైనే కాకుండా వారి జీవన స్థితిగతులపై కూడా దారుణంగా ప్రభావం చూపుతున్నదని ప్రపంచబ్యాంకు తెలిపింది. ఒక్క తూర్పు ఆసియాలోనే కరోనా సంక్షోభం కారణంగా కోటీ 10 లక్షల మంది పేదరికంలోకి జారిపోనున్నారని వెల్లడించింది. ఈ వ్యాధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే పెద్ద షాక్‌లాంటిదని, తూర్పు ఆసియాలో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు తూర్పు ఆసియా పరిసిఫిక్‌ ప్రాంత ప్రధాన ఆర్థిక వేత్త ఆదిత్య మట్టూ తెలిపారు.

 


ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిరేటు తీవ్రంగా పడిపోతుందని విశ్లేషించారు. చైనా ఆర్థిక వృద్ధి కూడా 2019లో 6.1శాతం ఉండగా ఈ ఏడాది అది 2.3శాతానికి పడిపోవచ్చని తెలిపారు. ప్రపంచంలో నేడు ఐదింట రెండొంతుల మంది లాక్‌డౌన్‌లో ఉండటంతో వ్యాపారాలన్నీ మూతపడ్డాయని, కోవిడ్‌-19 పుట్టినిల్లయిన చైనా ఈ సమస్యనుంచి బయటపడినప్పటికీ ఆర్థికపరంగా మాత్రం తీవ్రంగా నష్టపోక తప్పదని తెలిపారు. చైనా ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 5.9శాతంగా ఉండవచ్చని రెండు నెలల క్రితమే ప్రపంచబ్యాంకు అంచనావేసింది. కానీ కరోనా కారణంగా దాన్ని 2.3శాతానికి తగ్గించింది.

 


ఇదిలాఉండ‌గా, కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు భారత్‌ సమర్థంగా పోరాడుతున్నప్పటికీ దేశంలో నిరుద్యోగ రేటు గణనీయంగా పెరిగి దాదాపు 9 శాతానికి చేరింది. గత 43 నెలల్లో ఇదే అత్యధికమని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. దేశ నిరుద్యోగరేటు గత నెలలో 8.74 శాతానికి చేరిందని, డీమానిటైజేషన్‌ (పెద్దనోట్ల చెలామణి రద్దు) తర్వాత ఇదే అత్యధికమని తెలిపింది. అంతకుముందు 2016 ఆగస్టులో నిరుద్యోగరేటు 9.59 శాతంగా నమోదయింది. ఈ ఏడాది మార్చిలో నిరుద్యోగరేటు పట్టణ ప్రాంతాల్లో 9.35 శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 8.45 శాతంగా ఉన్నట్టు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఫిబ్రవరిలో దేశ నిరుద్యోగరేటు 7.78 శాతంగా నమోదయింది. జులై, అక్టోబర్‌ నెలలు మినహా గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఈ రేటు చాలావరకు 8 శాతంలోపే కొనసాగింది. జులై, అక్టోబర్‌ నెలల్లో మాత్రం 8 శాతం దాటింది. రాష్ర్టాలవారీగా చూస్తే ఈ ఏడాది మార్చిలో నిరుద్యోగరేటు త్రిపురలో అత్యధికం (29.9 శాతం)గా, పుదుచ్చేరిలో అత్యల్పం (1.2 శాతం)గా ఉన్నట్టు సీఎంఐఈ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: