దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్న క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో... తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు స‌మ‌య‌స్ఫూర్తి స్పంద‌న‌పై వివిధ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ఆయ‌న క్రియాశీలంగా స్పందించిన తీరు, వివిధ అంశాల‌పై ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు ఇవ్వడం ఇటు ప్ర‌భుత్వంపైనే కాకుండా అటు టీఆర్ఎస్ పార్టీ ప‌రంగా చూసిన ప్ర‌జ‌ల‌కు సానుకూల భావ‌న క‌లిగేలా తోడ్ప‌డింద‌ని అంటున్నారు. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయగలిగార‌ని పేర్కొంటున్నారు.

 

లాక్‌డౌన్ విష‌యంలోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన అనంత‌రం సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు ఇవ్వడంతో లాక్‌డౌన్‌లో ప్రజలకు నిత్యావసరాల కోసం ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. వైరస్‌ ప్రమాదంనుంచి తెలంగాణ బయటపడుతోంది అని అనుకున్న దశలోనే ఢిల్లీ మర్కజ్‌లో జరిగిన మతప్రార్థనల వ్యవహారం కరీంనగర్‌లో వెలుగుచూసింది. ఈ స‌మ‌యంలో మ‌త ప‌ర‌మైన సున్నిత అంశం అయిన‌ప్ప‌టికీ...ఇటు ఆ మ‌త‌స్తుల‌ను నొప్పించుకుండా మ‌రోవైపు వైర‌స్ వ్యాప్తి జ‌ర‌గ‌కుండా దేశానికి కూడా ఢిల్లీ ఘ‌ట‌న‌ను తెలియజేసింది కూడా తెలంగాణనే అని విశ్లేషిస్తున్నారు.

 

కీల‌క‌మైన ప‌రిపాల‌న విష‌యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సమన్వయం చేసుకుంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారు. అదే సమ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వంగా ప‌లు సొంత నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించి, టైం టు టైం మార్గదర్శకాలు ఇచ్చారు. దీంతో, సీఎస్‌, డీజీపీ, సీనియర్‌ అధికారులంతా టీంగా కమిట్‌మెంట్‌తో పనిచేశారు. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఇతర పరిపాలనాధికారులు సమన్వయంతో స్థానిక పోలీసులతో కలిసి పనిచేశారు. దీంతో స‌హ‌జంగానే ప్రజలు లాక్‌డౌన్‌కు బాగా సహకరించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో పేదలకు 12 కిలోల బియ్యం, రూ.1500 నగదు ఇస్తున్నారు. ఇతర రాష్ర్టాల వలస కూలీలు, నిలువనీడ లేనివారికి రేషన్‌కార్డుతో సంబంధం లేకుండా ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ.500 అందిస్తున్న తీరు దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు పొందింది. సాక్షాత్తు బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులే ప్ర‌శంసించారు. మొత్తంగా ఇటు తెలంగాణ ప్ర‌భుత్వానికి అటు టీఆర్ఎస్ పార్టీకి క‌ష్ట‌కాలంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ చూపించిన స‌మ‌య‌స్ఫూర్తి క‌లిసి వ‌చ్చింద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: