తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న విషయం విషయం తెలిసిందే.  కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటించటంతో దేశవ్యాప్తంగా రైతులు పంటలు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు ధాన్యం అమ్ముకోలేక పడుతున్న అవస్థలను చూసి కొన్ని రోజుల క్రితం సీఎం కేసీఆర్ ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. తాజాగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 6,500 రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
 
ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా అధికారులు కోటీ 5 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు జరగనున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా ప్రభుత్వం గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు జరిగేలా ఏర్పాట్లు చేయనుంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వివరాలను సేకరించింది. రాష్ట్రంలో నిజామాబాద్ లో అత్యధికంగా 540 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. 
 
జగిత్యాల, నల్గొండ, సిద్ధిపేట, కరీంనగర్, కామారెడ్డి, పెద్ద భూపాలపల్లి, మంచిర్యాల, కొత్తగూడెం, వనపర్తిలో 200 నుంచి 500 వరకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిగిలిన జిల్లాల్లో 100 నుంచి 150 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు జరపడం కోసం మరో 25 వేల కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఇవ్వడమే కాకుండా అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. 
 
పౌర సరఫరాల శాఖకు గతంలో 20,000 కోట్ల రుణం మంజూరు చేసేందుకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మరో 25,000 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గింజ కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల అవసరాలకు తగిన విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: