కరోనా కట్టడికి ట్రంప్‌ సర్కార్‌ ఏమీ చేయలేదని చెప్పేందుకు కూడా లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా భారీ ప్యాకేజీ ప్రకటించారు ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఇది అతి పెద్ద ప్యాకేజ్.! 

 

కరోనా వైరస్‌ అమెరికాను అతలాకుతలం చేస్తున్నవేళ.. ట్రంప్‌ 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించారు. కష్టకాలంలో ఉన్న అమెరికన్లకు ఇది ఎంతో దోహదపడుతుంది. ఆపదలో ఉన్న రాష్ట్రాలకు సాయం చేయడం, వైద్య పరికరాలు సమకూర్చు కోవడం, పరిశ్రమలకు ఊతమివ్వడం లాంటివి ఈ ప్యాకేజీలో ప్రధానాంశాలు. ఉద్యోగాలు లేని వారికి నగదు సాయం చేయడం కూడా ప్యాకేజీలో ఓ భాగం.

 

కరోనా వైరస్‌ కమ్మేసిన వేళ వైద్యం భారంగా మారింది. అందరికి వైద్యం అందించే పరిస్థితులు లేవు. ఆసుపత్రులన్నీ ఇప్పటికే నిండిపోయాయి. కొత్తగా తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. వ్యాధి లక్షణాలున్నవారికి పరీక్షలు చేయడం, వ్యాధి సోకిన వారికి చికిత్స చేయడం పెద్ద సవాల్‌గా మారింది. ఈ సమయంలో భారీగా డబ్బు ఖర్చవుతోంది. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకే ట్రంప్ ఇంత పెద్ద ఎత్తున నిధులను కేటాయించారు.

 

ఇది ఉద్దీపన ప్యాకేజ్ అని చెప్తున్నా.. ఇది ఆపదలో ఆదుకునేందుకు.. ఒకవిధంగా చెప్పాలంటే అందరికీ తిండి, వైద్యం అందించేందుకు కేటాయించిన ప్యాకేజీగా చెప్పుకోవచ్చు. ఈ ప్యాకేజీతో లబ్ది పొందే కంపెనీలు ఉత్పాదకతను పెంచేందుకు వీలవుతుంది. వీలైనంత త్వరగా వైద్య పరికరాలను అందించేందుకు కృషి చేస్తాయి. ఇప్పుడు కావాల్సింది కూడా అదే.!


 
మరోవైపు కరోనా వైరస్‌కు అవసరమైన టీకాలు, చికిత్స విధానాలను డెవలప్‌ చేయడానికి కూడా నిధులు పెద్ద ఎత్తున అవసరమవుతాయి. దేశంలోని శాస్త్ర సాంకేతిక కంపెనీలు, యూనివర్సిటీలు, ఫార్మా కంపెనీలు ఇప్పుడు ఈ విషయంపై ఎక్కువగా దృష్టి పెట్టాయి. ఉద్దీపన ప్యాకేజీ ఇలాంటి కంపెనీలకు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది.

 

ఇప్పటికే పలు పరిశోధన సంస్థలు చికిత్సా మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఓ కంపెనీ వ్యాక్సిన్‌పై ప్రయోగాలు స్థాయికి చేరుకుంది. వ్యాక్సిన్‌ను ఇటీవలే ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. మరో సంస్థ గంటలోపే ఫలితాన్నించే టెస్టింగ్‌ కిట్స్‌ను అభివృద్ధి చేస్తోంది. దీంతో వ్యాధిగ్రస్తులను వీలైనంత వేగంగా కనుక్కునేందుకు వీలవుతుంది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇదెంతో అవసరం. 

 

ట్రంప్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీతో పరిశోధన, ఔషధ తయారీ సంస్థలు ఎంతో ఉత్సాహంగా ఉన్నాయి. వీలైనంత త్వరగా మందులు, వ్యాక్సిన్లను అభివృద్ధి చేసేందుకు ఈ ప్యాకేజీ ఎంతో ఉపయోగపడుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆరు నెలలలోపే కరోనాకు మందులు రావచ్చని అంచనా. వ్యాక్సిన్‌ రావడానికి మాత్రం కనీసం ఏడాది పడుతుందని భావిస్తున్నారు. అప్పటివరకూ వైరస్‌ వ్యాప్తిని వీలైనంత వరకూ కట్టడి చేయడమే ట్రంప్‌ ముందున్న ఏకైక లక్ష్యం.

 

ట్రంప్ ఎన్ని తప్పులు చేసినా.. ఆయన ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్ మాత్రం ప్రశంసలు అందుకుంటోంది. ఈ ప్యాకేజీలో అధిక మొత్తం ప్రైవేటు కంపెనీలకే వెళ్తాయి. అయితే అవన్నీ దేశానికి దోహదపడే పలు ఉత్పత్తులు అందిస్తాయి. దీంతో ఆర్థికంగా అమెరికా మరింత ఎదిగేందుకు దోహదపడుతుంది. అగ్రరాజ్యానికి ఇంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: