లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వాలు చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులకు పొంతన లేదా? నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయా? పాలు నుంచి కూరగాయలు, ఉప్పు, పప్పుల వరకూ ఏవీ సామాన్య ప్రజలు కొనేలా లేవా? ఇదేఛాన్స్‌గా వ్యాపారులు ఉన్నసరుకును బ్లాక్‌ చేసి ఎక్కువ రేటుకు అమ్ముతున్నారా? దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ మూడోవారంలోకి ప్రవేశిస్తున్న సమయంలో పరిస్థితులు విషమిస్తున్నాయా? 

 

కరోనాను కట్టడి చేయాల్సిందే. ఇందులో ప్రజలకు ఎలాంటి సందేహం లేదు. కానీ.. ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేస్తున్న ఆంక్షల వల్ల ఎదురవుతున్నఇబ్బందులే కలవరపెడుతున్నాయి. సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. లాక్‌డౌన్‌ ప్రకటించే సమయానికి పరిస్థితులు సాధారణంగానే కనిపించినా.. రెండో వారానికి చేరుకునే సరికి మునుపటిలా లేదు. ఎండల మాదిరే నిత్యావసరాల ధరలు కూడా దంచి కొడుతున్నాయి. ఆకాశమే హద్దుగా రేట్లు పెరిగిపోయాయి.  నీళ్ల టిన్‌ దగ్గర నుంచి పాలు, కూరగాయలు, దుకాణాల్లో లభించే కనీస సరుకుల ధరలు ఏవీ అందుబాటులో లేవు. సంచినిండా డబ్బులు పట్టుకెళ్లితే.. చేతినిండా సరుకులు తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇదేంటీ.. ఇంత రేటా అని దుకాణదారుడిని అడిగే పరిస్థితి లేదు. వ్యాపారి చెప్పిన రేటుకు కొనుగోలు చేయాల్సిందే. 

 

దేశం మొత్తం ఇదే దుస్థితి ఉంది. సామాన్యులు ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు. లాక్‌డౌన్‌ ప్రకటనకంటే ముందు ఉన్న రేట్లు పది నుంచి 20 శాతం వరకూ పెరిగిపోయాయి. పోనీ అత్యవసరం కాబట్టి  కొందామన్న నిత్యావసరాలు దొరికని ప్రాంతాలు కూడా ఉన్నాయి. రేట్లను పెంచొద్దని.. అలా పెంచితే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు చేసిన హెచ్చరికలు మాటలకే పరిమితమయ్యాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ధరల దోపిడీని ఎవ్వరూ అడ్డుకోలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఆంక్షలు అమలులో ఉన్నా.. నిత్యావసరాల రవాణాకు ఎలాంటి ఆటంకం లేదని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినా.. అసలు లారీలు, ఇతర వాహనాలు కదిలితే ఒట్టు. రోడ్లపై లారీలు.. సరుకు రవాణా వాహనాలు కనిపిస్తే పోలీసులు వ్యవహరిస్తున్న తీరుసైతం సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 

 

రవాణా వ్యవస్థ స్తంభించడం, సాగు విస్తీర్ణం తగ్గడం కూడా కూరగాయల రేట్లు పెరగడానికి కారణం అవుతోంది. టమోటా, మిర్చి, బెండకాయ, వంకాయ, దొండకాయ, బంగాళాదుంపలు వేటిని చూసినా భారీగానే అమ్ముతున్నారు. ఎటు చూసినా ధరలు మంట పుట్టిస్తున్నాయి.  జనతా కర్ఫ్యూ కంటే ముందు రోజు... అంటే శనివారం మార్కెట్లలో కిలో టమోట ధర 10 రూపాయలు ఆ తరువాత 80 నుంచి 100 రూపాయలకు కిలో విక్రయిస్తున్నారు.  ఇప్పుడే ఇలా ఉంటే... లాక్‌డౌన్‌లో మిగిలిన రోజుల్లో ఎలా ఉంటుందో అనే ఆందోళన నెలకొంది.

 

లాక్‌డౌన్ కారణంగా నిత్యవసర సరుకులతోపాటు పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, పప్పుదినుసులు వంటింట్లో వినియోగించే ప్రతి వస్తువు ధర చుక్కలను అంటుతున్నాయి. గత నెలతో పోల్చుకుంటే ధరలు రెట్టింపు అయ్యాయి.  కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు వైద్యులు సూచిస్తున్నారు. అయినా మాంసం కోసం, మరోవైపు కూరగాయలు, నిత్యవసరాలు, ఇంకోవైపు రేషన్‌ బియ్యం, కందిపప్పు కోసం ప్రజలు బారులు తీరుతున్నారు.

 

లాక్‌డౌన్‌ వల్ల మేకలు, పొట్టేళ్ల సరఫరా లేదంటూ కిలో 800 నుంచి 900 రూపాయల వరకు మాంసం అమ్మారు. ధరలు ఎంత పెరిగినా మాంసప్రియులు మాత్రం ఎగబడి కొన్నారు. ఇక చేపల మార్కెట్‌లో కిలో రకాన్ని బట్టి కిలో 50 నుంచి కిలో 250 రూపాయల వరకు ధరలు పలికాయి. 

 

లాక్‌డౌన్‌ వల్ల టోకు వర్తకుల వద్ద సరుకు నిల్వలు అయిపోనట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో బ్రాండెడ్‌ సరుకులు కాకుండా నాసిరకానివి అమ్ముతున్నారు. కొన్నిచోట్ల పామాయిల్‌ లీటరు 90 రూపాయలు, సన్‌ఫ్లవర్‌ లీటరు 105 రూపాయలు, వేరుశెనగ నూనె 140 రూపాయలు, బొంబాయి రవ్వ కిలో 32 నుంచి 42 రూపాయలు, గోధుమ రవ్వ కిలో 32 నుంచి 44 రూపాయలు, కందిపప్పు కిలో 80 నుంచి 100 రూపాయలు, చెక్కర కిలో 30 నుంచి 40 రూపాయలు, బెల్లం కిలో 40 నుంచి 60 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఒకపక్క కేంద్ర ప్రభుత్వం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించినా కొంత మంది వర్తకులు వినియోగదారులను ధరల రూపంలో దోచుకోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

కూరగాయలు, రేషన్ సరుకులతోపాటు ఫ్రూట్స్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ సీజన్‌లో లభించే పండ్లతో పాటు యాపిల్స్, ఆరెంజ్,పుచ్చకాయ, కర్భుజా, గ్రేప్స్ ధరలు కూడా రెట్టింపు చేసి వ్యాపారులు విక్రయిస్తున్నారు. 

 

పది రోజులు లాక్‌డౌన్ కే రాష్ట్రంలో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజులు కూడా కిరాణా షాపుల్లో సరుకులు నిండే అవకాశం లేదని, ఇతర రాష్ట్రాల నుంచి కంటైనర్లు వస్తే తప్ప పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం లేదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: