వాస్తవానికి లాక్‌డౌన్‌ ప్రకటించే సమయానికే చాలా ప్రాంతాల్లో నిత్యావసరాల రేట్లు పెంచేశారు. ఇంకా లాక్‌ డౌన్‌ వారం పైనే ఉంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటో తెలియదు. ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరగుతున్నాయి. అక్కడక్కడా వ్యాపారులతో వాదనలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోకపోతే శాంతి భద్రతల సమస్యగా మారే ప్రమాదం లేకపోలేదు. 

 

లాక్‌ డౌన్‌ సమయంలో పనులు లేక రోజు కూలీలు తట్టా, బుట్టా నెత్తిన పెట్టుకుని.. పిల్లలను చంకలో వేసుకుని ...కాళ్లనే చక్రాలను చేసుకుని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంతూళ్లకు బయలుదేరారు. కొందరు ఇళ్లకు చేరుకోకుండానే మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. అదేంటీ వీరంతా ఎందుకు ఇలా రోడ్డున పడి వెళ్లిపోతున్నారు అని అంతా అనుకున్నారు. కానీ.. ధరాఘాతమే నిరుపేదలను నడిచి వెళ్లేలా చేసింది. రోజూ పనికి వెళ్లితేనే ఇంటిల్లపాదీ ఆకలి తీరుతుంది. పనులు లేకపోతే ఆ రోజుకు పస్తే. 21 రోజుల లాక్‌డౌన్‌ అంటే అన్ని రోజులూ పనులు పోయినట్లే. పైగా చేతిలో ఉన్న ఐదొందలు.. వెయ్యి రూపాయలతో 21 రోజులు నెట్టుకొచ్చే పరిస్థితి కనిపించలేదు. దీనికి కారణం... పెరిగిన నిత్యావసరాలే. దీంతో చేసేది లేక ఉపాధికోసం పట్టణాలకు వెళ్లినవారంతా ... ప్రాణాలకు తెగించి సొంతూళ్లకు కాలినడకన బయలుదేరారు. 

 

ఇది ఒక్క వలస జీవుల సమస్తే కాదు. ఇళ్లకే పరిమితం అయిన సామాన్య ప్రజలదీ ఇదే ఇబ్బంది. కేజీ కందిపప్పు కొనాలంటే  రేటు విన్న తర్వాత ఫీజులు ఎగిరిపోతున్నాయి. ఆఖరికి ఉప్పు ప్యాకేట్‌ రేటు కూడా పెంచేశారు.  

 

చాలా ప్రాంతాల్లో బియ్యం దొరకడం లేదని అంటున్నారు. ఒకవేళ ఉన్నా.. రెండింతలు పెట్టి రైస్‌ బ్యాగ్స్‌ కొనుగోలు చేస్తున్నారు.  క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఎక్కడికక్కడ బారికేడ్లను పెట్టడంపై  పోలీసులు, ఇతర అధికారులుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఆన్‌లైన్‌లో సరుకులు బుక్‌ చేద్దామన్నా అవుట్‌ ఆఫ్‌ సప్లయ్‌ అని చూపిస్తోందని వాపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దుకాణాల్లో సరుకులు అయిపోయినా.. తిరిగి ఎప్పుడు వస్తాయో కూడా చెప్పలేకపోతున్నారు. ఇదే జనాల్లో భయాందోళనలకు కారణం అవుతోంది. 

 

కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు రేట్ల విషయంలో వ్యాపారులను గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. దీంతో కోపంతో వ్యాపారులు దుకాణాలు మూసివేస్తున్నాయి. బ్లాక్‌ మార్కెటింగ్‌ బాగా పెరిగిపోయింది. దీనిని ఇలాగే ఉపేక్షిస్తే శాంతి భద్రతల సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.  అమెరికా, ఇటలీ, ఫిలిప్పైన్స్‌ వంటి దేశాల్లో లాక్‌డౌన్‌ సమయంలోనే లూటీలు జరిగాయి. మన దగ్గర ఆ పరిస్థితి ప్రస్తుతానికి అయితే లేదు. కానీ.. అలాంటి పరిణామాలకు దారితీయకుండా ధరల సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: