దేశమంతా లాక్‌ డౌన్ తో బడుగుల బతుకులు లాక్‌ అయిపోయాయి. రెక్కాడితే డొక్కాడని కష్టజీవుల పరిస్థితి దయనీయంగా మారింది. తెలంగాణలోనే కాదు.. కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో కూడా నేతన్నలు కష్టాలు పడుతున్నారు. కరోనా లాక్‌ డౌన్‌ దెబ్బకు చేనేత కార్మికుల బతుకులు ప్రశ్నార్థకంగా మారాయి.

 

లాక్ డౌన్ నేపథ్యంలో కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో చేనేత పరిశ్రమ సంక్షోభంలో పడింది. ఇప్పటికే అనేక సమస్యల్లో ఉన్న నేతన్నలు లాక్‌ డౌన్‌ తో కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. చేయటానికి పనిలేక, నేసిన బట్ట అమ్ముడుపోక, పూటగడవని పరిస్థితిలో పడ్డారు.

 

కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలో మోరగుడి, దొమ్మర, మరియు వేపరాల గ్రామాల్లో  అత్యధికులు చేనేత ఆధారంగా బతికేవారే.  ఏ రోజుకారోజు మగ్గం నేసి వచ్చే అరకొర ఆదాయంతో బతుకుబండి లాగుతున్నావారే. ఇంటిల్లిపాది రోజంతా కష్టపడితే వచ్చేది రూ. 300. ఒక్కోసారి అదీ ఉండదు. సాధారణ రోజుల్లోనే పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే, కరోనా ధాటికి లాక్‌ డౌన్‌ విధించటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పనులు లేక పస్తులు పడుకునే దుస్థితికి వచ్చేశారు.

 

జమ్మలమడుగు ప్రాంతంలో తయారుచేసే పట్టు మరియు కాటన్ చీరలకు మార్కెట్‌ లో మంచి డిమాండ్ వుంటుంది. తక్కువ ధరలతో పాటు నాణ్యమైన వస్త్రాలుగా వీటికి గుర్తింపు ఉంది. కరోనా లాక్‌ డౌన్‌ తో  రవాణా సౌకర్యాలు కూడా పూర్తిగా నిలిచిపోవడంతో మగ్గాలకు కావాల్సిన ప్రధాన ముడిసరుకులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో చేనేత కార్మికులు పనులు లేక లబోదిబో మంటున్నారు. 

 

నేత కార్మికులది ఒక రకమైన బాధ అయితే మాస్టర్ వీవర్ ది  మరో రకమైన కష్టం. ఇక్కడ నేసిన బట్టలను పట్టణాలు, నగరాల్లో దుకాణాలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇంటినుంచి కదల్లేని పరిస్థితి కావటంతో ఇప్పటివరకు నేసిన చీరల స్టాక్‌ పేరుకుపోయి ఉంది. వాటిని అమ్మేదెపుడు, వాటి కోసం చేసిన అప్పులు తీర్చేదెపుడనే టెన్షన్‌ లో పడ్డారు. వడ్డీలు, అప్పులు పెరుగుతూ, నేత పనిలో కొనసాగలేని పరిస్థితికి చేరుకుంటున్నారు. 

 

రోజంతా పనిచేసినా కష్టాలు తీరని పరిస్థితిలో పూర్తిగా పని ఆగిపోవటంతో మరింత కష్టాల్లో పడ్డారు నేతన్నలు. ప్రభుత్వాలు తమకు ఆహార భద్రతను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. చేనేత వృత్తి మీదనే జీవిస్తున్న తమకు ఇప్పుడు కోలుకోలేంత కష్టకాలం వచ్చిందని  ఇరవై రోజుల నుండి తమ జీవితాలు అయోమయంలో పడ్డాయని చెప్తున్నారు చేనేత కార్మికులు. ఇలాంటి కష్టకాలంలో చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలను ప్రభుత్వం ఆప్కో ద్వారా కొనుగోలు చేసి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: