ఏపీలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కఠినంగా కొనసాగుతున్నా, ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన వారితో కరోనా కేసులు బాగా పెరిగాయి. ఇక కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జగన్ ప్రభుత్వం కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే కరోనా వ్యాప్తి ఏ స్థాయిలో పెరుగుతుందో, అదే స్థాయిలో ప్రతిపక్ష టీడీపీ కరోనా మీద రాజకీయం చేస్తోంది. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వానికి ఉండాల్సింది పోయి, కోడి గుడ్డు మీద ఈకలు పీకుతుంది. చంద్రబాబు, నారా లోకేశ్‌తో పాటు, మిగిలిన టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

 

ప్రతిరోజూ ఏదొక విషయాన్ని పట్టుకుని రాజకీయం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలు, కార్యకర్తలు జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు, దేవినేని అవినాష్ లక్ష్యంగా పెట్టుకుని ట్రోల్స్ వేస్తున్నారు. తాజాగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో జగన్ పభుత్వం, పేద ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో, రూ. వెయ్యి రూపాయలు, ఉచిత రేషన్ ఇస్తున్న విషయం తెలిసిందే.

 

ఇక విజయవాడ తూర్పు వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న దేవినేని అవినాష్ కూడా, తన నియోజకవర్గంలోని ప్రజలకు వెయ్యి రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇక ఇదే విషయం మీద టీడీపీ కార్యకర్తలు రచ్చ చేస్తున్నారు. టీడీపీలో ఉన్నప్పుడూ అవినాష్ ఎలా ఉండేవారు...ఇప్పుడు వాలంటీర్‌గా మారిపోయారంటూ ఎగతాళి చేస్తున్నారు. అటు అవినాష్ సామాజికవర్గానికి చెందిన కమ్మ టీడీపీ కార్యకర్తలైతే, మా వాడు ఏమవ్వుతాడో అనుకున్నాం...చివరికి వాలంటీర్ అయ్యాడంటూ పోస్టులు పెడుతున్నారు.

 

అసలు ఇలాంటి విపత్కర సమయంలో అవినాష్ తూర్పు ప్రజలకు అండగా ఉంటున్నారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దినసరి కూలీలు, యాచకులు, అనాథలు, స్వస్థలాలకు వెళ్లలేక చిక్కుకున్న విద్యార్థులు, నిరుపేదలకు నిత్య అన్నదానం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం అందిస్తున్న వెయ్యి రూపాయలని తానే స్వయంగా వెళ్ళి పేద ప్రజలకు అందిస్తున్నారు. ఈ విధంగా అవినాష్ మానవత్వం చాటుకుంటుంటే,టీడీపీ వాళ్ళు మాత్రం ఆయన్ని దారుణంగా అవమానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: