కరోనా వ్యాధి బాధితులు రోజుకింత  పెరుగుతుండడంతో  తమకు ఎక్కడ ఆ వ్యాధి,  సోకుతుందోనని వైద్యులు , వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు . కరోనా మహమ్మారి విస్తృతమవుతున్న నేపధ్యం లో వైద్యులు , వైద్య సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు . అయితే    కామారెడ్డి జిల్లా లో మాత్రం  కరోనా రోగుల సంఖ్య పెరుగుతుండడం తో , స్థానికంగా  కాంట్రాక్ట్   వైద్యులుగా పని చేస్తోన్న ఆరుగురు  తమ ఉద్యోగానికి రాజీనామా చేయడం కలకలం రేపింది .  స్థానిక జిల్లా కలెక్టర్ , డీఎంహెచ్ ఓ లు ఆ ఆరుగురు వైద్యులతో   చర్చలు జరిపి వారు  తమ రాజీనామాలు వెనక్కి తీసుకునేవిధంగా ఒప్పించారు .

 

ఇలాంటి క్లిష్ట సమయం లో ఉద్యోగానికి రాజీనామా చేయడం సరికాదని కలెక్టర్ , డీఎంహెచ్ ఓ లు కాంట్రాక్ట్ వైద్యులకు  హితవు పలికారు . కాంట్రాక్ట్  వైద్యుల రాజీనామా ఉదంతం సుఖాంతం కావడం తో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది . వైద్యులు , వైద్య సిబ్బంది నుంచి ఈ తరహా ఇబ్బందులు తలెత్తుతాయని భావించే  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే వైద్య సేవలను ఎస్మా పరిధిలోకో తీసుకు వచ్చిన విషయం తెల్సిందే . అదే తరహా లో రేపో , మాపో తెలంగాణ ప్రభుత్వం కూడా అత్యవసర సేవల్ని ఎస్మా పరిధిలోకి తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు విన్పిస్తున్నాయి  .

 

అత్యవసర సేవల్ని ఎస్మా పరిధిలోకి తీసుకురావడం ద్వారా కామారెడ్డి జిల్లాలో కాంట్రక్టు  వైద్యులు తమ ఉద్యోగానికి రాజీనామా  చేసినట్లుగా , ఎవరు కూడా తమ ఉద్యోగానికి రాజీనామా చేసే అవకాశం ఉండదని ప్రభుత్వం అధికారులే చెబుతున్నారు . ఒకవేళ ఆలా ఎవరైనా  చేస్తే ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకునే వెసులుబాటు లభిస్తుందని పేర్కొంటున్నారు . ఈ విపత్కర సమయం లో వైద్య సిబ్బంది అధైర్య పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: