కరోనా వ్యాధి ఉందనే ఉద్దేశ్యం తో ఒక వ్యక్తిని గ్రామస్తులంతా దూరంగా పెట్టడం తో తీవ్ర మనస్థాపానికి గురైన  అతడు అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని ఉవా జిల్లాలో చోటు చేసుకుంది . వివరాల్లోకి వెళితే  ఢిల్లీ లో జరిగిన తబ్లీగి  జమాత్ మతసమ్మేళనం లో  మహ్మద్ దిల్షాన్ అనే వ్యక్తి పాల్గొని , స్వగ్రామానికి తిరిగి వచ్చాడు . తబ్లీగి జమాత్ సమ్మేళనం లో పాల్గొన్న చాలామంది కరోనా వ్యాధి బారిన పడడం తెల్సిందే . తబ్లీగి జమాత్ సమ్మేళనం లో పాల్గొని వచ్చిన మహ్మద్ దిల్షాన్  ను క్వారంటైన్ చేసి ,  వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా , నెగిటివ్ అని తేలింది .

 

అయినా కూడా గ్రామస్థులు అతన్ని దూరం పెడుతూ వచ్చారు . దీనితో అతడు తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు . కరోనా ను కట్టడి చేసేందుకు సామాజిక దూరం పాటించాలని కానీ సామాజిక బహిష్కరణ చేయడం నేరమని  రాష్ట్ర డీజీపీ సీతారాం అన్నారు . కరోనా కట్టడి కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదేనన్న ఆయన , ఇతరుల్ని ఇబ్బందికి గురి చేయడం పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు . ఇకపోతే గ్రామస్థులు మహ్మద్ దిల్షాన్ పై వివక్ష చూపించి , సామాజిక బహిష్కరణ చేశారా ?, లేదా ?? అన్నదానిపై నిజనిర్ధారణకు విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు .

 

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి .   ఢిల్లీ లో జరిగిన తబ్లీగి జమాత్ మతసమ్మేళనం లో పాల్గొన్న వారే వల్లే అధికశాతం కేసులు వెలుగు చూస్తున్న విషయం తెల్సిందే . దీనితో పనిగట్టుకుని కొంతమంది ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకోవడం కన్పిస్తోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి .      

మరింత సమాచారం తెలుసుకోండి: