ప్ర‌పంచ‌వ్యాప్తంగా కరోనా వైరస్ మ‌హ‌మ్మారిగా మారి అంద‌రినీ క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తున్న సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన ప్ర‌జ‌లు కోట్లాది మంది ఉన్నారు. ఈ నేప‌థ్యంలో పోప్ ఫ్రాన్సిస్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. క్యాథలిక్ హోలీవీక్ ఉత్సవాలను అట్టహాసంగా, జనసందోహం మధ్య నిర్వహించే శతాబ్దాల ఆచారానికి వ్యాటికన్ కరోనా కారణంగా గుడ్‌బై చెప్పింది. పామ్ సండే అనేది సిలువ వేసేందుకు ముందు జెరూసలేంలోకి క్రీస్తు ప్రవేశాన్ని సూచించే పండుగ. ఏప్రిల్ 12న జరిగే ఈస్టర్ సండే క్రీస్తు పునరుత్థానాన్ని సూచిస్తుంది. ఈ రెండు సందర్భాలలోను పోప్ జనసమ్మర్దం మధ్య ప్రసంగించడం సంప్రదాయంగా వస్తున్నది. కానీ కరోనా కారణంగా పోప్ లాగే 130 కోట్ల మంది క్యాథలిక్కులు నాలుగు గోడలకే పరిమితమయ్యారు. పోప్ రాజ్యమైన వ్యాటికన్ సిటీలోకి పర్యాటకుల రాకపోకలను నెలరోజులుగా నిలిపివేశారు. దీంతో కరోనా కల్లోలం కారణంగా ఆయన తన పామ్ సండే మాస్‌ను జనసందోహం మధ్య కాకుండా లైవ్‌స్ట్రీంలో నిర్వహించారు. పోప్ తన సందేసంలో కరోనా ఉత్పాతాన్ని ఓ విషాదంగా అభివర్ణించారు. దీనిని అందరూ ధైర్యంగా, ఆశావాదంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన ఆయన అనుయాయులు టీవీల్లో ఆ సందేశాన్ని వీక్షించారు. 

 

కాగా, పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కరోనాపై పోరాటంలో భాగంగా శనివారం లాహోర్‌లో కరోనా రిలీఫ్‌ ఫండ్‌ను ప్రారంభించిన అనంతరం ఇమ్రాన్‌ఖాన్ మీడియాతో మాట్లాడారు. క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్నా పాకిస్థాన్‌లో ప్ర‌జ‌లు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంపై ఇమ్రాన్‌ఖాన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌రోనా బారినుంచి అల్లా కాపాడుతాడ‌ని, పాకిస్థానీల‌కు రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎక్కువని సోష‌ల్‌ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్లు ఇటీవ‌లె త‌న దృష్టికి వ‌చ్చింద‌ని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. సోష‌ల్ మీడియాలో జ‌రిగే త‌ప్పుడు ప్ర‌చారాన్ని న‌మ్మి ప్ర‌జ‌లు మూర్ఖుల్లా ప్ర‌వ‌ర్తించ‌వ‌ద్ద‌ని ఆయ‌న కోరారు.అంతేకాదు, నియంత్ర‌ణ పాటించ‌ని వారిని క‌రోనా మహమ్మారి వ‌దిలిపెట్ట‌ద‌ని పాకిస్థాన్ ప్ర‌ధాని హెచ్చ‌రించారు. అమెరికా, చైనా లాంటి పెద్ద‌పెద్ద దేశాలనే క‌రోనా వైర‌స్ ఉక్కిరిబిక్కిరి చేసింద‌ని, ఈ వైర‌స్ రూపంలో ఇప్పుడు మ‌న దేశానికి ఒక పెద్ద స‌వాల్ ఎదురైంద‌ని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఈ స‌వాల్‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొని క‌రోనాపై విజ‌యం సాధిద్దామ‌ని పాకిస్థాన్ ప్ర‌జ‌ల‌కు ఇమ్రాన్‌ఖాన్‌ పిలుపునిచ్చారు. ఇంత‌టి క్లిష్ట స‌మ‌యంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించి చ‌రిత్ర‌లో మూర్ఖులుగా నిలిచిపోవ‌ద్ద‌ని ఆయ‌న కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: