రేపు.. అంటే ఏప్రిల్ 7వ తేదీన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేస్తారా..?  ముందుగా ప్ర‌క‌టించిన‌ట్లుగానే అంద‌రికీ శుభ‌వార్త వినిపిస్తారా..? అంటూ ప్ర‌జ‌లు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. ఇంత‌కీ ఏమిటా విష‌య‌మ‌ని అనుకుంటున్నారా..? అయితే.. మీరు చిన్న క‌థ‌నం చ‌ద‌వాల్సిందేమ‌రి..!  ఏప్రిల్ 7వ తేదీ త‌ర్వాత శుభ‌వార్త వింటార‌ని, క‌రోనా వైర‌స్ ఫ్రీ తెలంగాణ‌ను చూడ‌బోతున్నారంటూ ఇటీవ‌ల సీఎం కేసీఆర్ చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ ప్ర‌క‌ట‌న చేసిన మ‌రునాడు.. త‌బ్లిఘీ జామాత్ ఉదంతం బ‌య‌ట‌ప‌డ‌డంతో ఒక్క‌సారిగా సీన్ మారిపోయింది. ఎక్కువ‌గా తెలుగు రాష్ట్రాల నుంచే ముస్లింలుజామ‌త్‌కు హాజ‌రై వ‌చ్చిన విష‌యం వెలుగులో రావ‌డంతో ప‌రిస్థితులు చేజారిపోయాయి. ఏకంగా తెలంగాణ‌లో ఆరుగురు మ‌ర‌ణించ‌డంతో క‌ల‌క‌లం రేగింది. ఇందులో ఒక‌రు చ‌నిపోయిన త‌ర్వాత చేసిన ప‌రీక్ష‌ల్లో క‌రోనా పాజిటివ్ అని తేలింది. తెలంగాణ‌లోని అన్ని జిల్లాల నుంచి కూడా ముస్లింలు జామాత్‌కు హాజ‌రైన‌ట్లు తేలడంతో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైన వారిని గుర్తించి, క్వారంటైన్‌కు పంపించ‌డం మొద‌లు పెట్టారు. 

 

నిజానికి.. అప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో క‌రోనా అదుపులోనే ఉంద‌ని అంద‌రూ అనుకున్నారు. ఇక్క‌డ క‌ట్ట‌డి చేయ‌గ‌లిగామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంచ‌నాకు వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ 7న శుభ‌వార్త వింటార‌ని, క‌రోనా లేని తెలంగాణ‌ను చూడబోతున్నారంటూ ఆయ‌న చాలా ఆనందంగా చెప్పారు. కానీ.. త‌బ్లిఘీ జమాత్ ఉదంతం త‌ర్వాత తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతోంది. రోజురోజుకూ క‌రోనా ప్ర‌భావం తీవ్ర‌మ‌వుతోంది. ఆదివారం ఒక్క‌రోజే  62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు  ఈ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 334కు చేరింది. ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 33కు చేరిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 283 మంది చికిత్స పొందుతుండగా.. క‌రోనా మహమ్మారి కారణంగా 11 మంది మృతి చెందారు.  ఇక‌ హైదరాబాద్‌లో అత్యధికంగా 139 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ ఏప్రిల్ 7వ తేదీన ఏం చెప్ప‌బోతున్నార‌న్న‌ది అంద‌రిలో ఉత్కంఠ రేపుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: