క‌రోనా వైర‌స్ చాప‌కిందనీరులా విస్త‌రిస్తోంది. ప్ర‌జ‌ల‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నా.. ఎక్క‌డో ఒక చోట ఏదో ఒక ర‌కంగా దీని బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతూనే ఉంది. తెలియ‌క కొంద‌రు.. తెలిసికూడా మ‌రికొంద‌రు వైర‌స్ బారిన‌ప‌డుతున్నారు. ఇదే స‌మ‌యంలో వారి కుటుంబ స‌భ్యుల‌తోపాటు చుట్టుప‌క్క‌ల వారిని కూడా ప్ర‌మాదంలోకి నెడుతున్నారు. ఎలాంటి అనుమానం ఉన్నా.. స్వ‌చ్ఛందంగా ద‌వాఖాన‌కు వ‌చ్చి ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని, ఇత‌ర దేశాలు, ఇత‌ర రాష్ట్రాల నుంచి సొంతూళ్లకు వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌కుండా అధికారుల‌కు స‌మాచారం అందించాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌దేప‌దే మొత్తుకుంటున్నా.. కొంద‌రు మాత్రం అస్స‌లు మార‌డం లేదు. దీంతో క‌రోనా వైర‌స్ వ్యాప్తి క్ర‌మంగా పెరుగ‌తుందే త‌ప్ప త‌గ్గ‌డం లేదని ప‌లువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు. తాజాగా.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఓ వ్య‌క్తి నిర్ల‌క్ష్యానికి సుమారు 26వేల మంది ప్ర‌మాదంలో ప‌డ్డారు. 

 

 మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్య‌క్తి దుబాయ్‌లోని ఓ హోటల్‌లో వెయిట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు.  తల్లి మరణవార్తతో మార్చి 17న భారత్‌కు తిరిగివచ్చాడు. 20న తల్లి దినకర్మను నిర్వహించాడు.    దశ దినకర్మ కార్యక్ర‌మానికి సుమారు వెయ్యిమందికిపైగా వ‌చ్చార‌ట‌. అయితే..  భార్యతోపాటు తనకూ అనారోగ్యం రావడంతో మార్చి 27న దవాఖానకు వెళ్లారు. కరోనాగా అనుమానించిన వైద్యులు శాంపిళ్లను సేకరించి వారిని ఐసోలేషన్‌ ఉంచారు. కొవిడ్‌-19 సోకినట్లు తేలడంతో తాను దుబాయ్‌ నుంచి వచ్చినట్లు అధికారులకు తెలిపాడు. అయితే అంత‌కుముందు తాను దుబాయ్‌ నుంచి తిరిగి వచ్చిన విషయాన్ని అతడు అధికారుల వద్ద దాచాడు. ఇదిలా ఉండ‌గా.. ద‌శ‌దిన క‌ర్మ‌కు హాజ‌రైన‌ వారిలో ఇప్పటికే 10 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో వెంట‌నే అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ కార్యక్రమానికి హాజరైనవారు, వారి కుటుంబీకులు, సన్నిహితులను కలిపి సుమారు 26,000 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఈ విష‌యం ఇప్పుడు స్థానికంగానేకాదు..దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: