భార‌త్‌లో క‌రోనా వైర‌స్‌రోజురోజుకూ విజృంభిస్తోంది. వైర‌స్ వ్యాప్తి నిరోధానికి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు నాలుగు వేల పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. సుమారు వంద‌మందికిపైగా మృతి చెందారు. ఆదివారం ఒక్క‌రోజే ఏకంగా 27మంది మృత్యువాత‌ప‌డ‌డంతో ప్ర‌భుత్వాల‌తోపాటు ప్ర‌జ‌ల్లోనూ ఆంద‌ళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో దేశంలో మ‌రింత వేగంగా క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేప‌ట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఎంత వేగంగా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లుచేస్తే అంత త్వ‌ర‌గా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌వ‌చ్చున‌ని భావిస్తోంది. ఇప్ప‌టికే లాక్‌డౌన్‌తో ప్ర‌జ‌లు దాదాపుగా ఇళ్ల‌కే ప‌రిమితం అవుతున్నారు. అత్య‌వ‌స‌ర ప‌నులు, నిత్యావ‌స‌ర స‌రుకుల కోసం త‌ప్ప ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. కానీ, త‌బ్లిఘీ జమాత్ త‌దిత‌ర ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో క‌రోనా వైర‌స్ దేశ‌వ్యాప్తంగా విస్త‌రించింది. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు వైర‌స్‌క‌ట్ట‌డికి మ‌రింత క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. 

 

ప్ర‌స్తుతం ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్‌రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) కింద ఉన్న ల్యాబుల్లో రోజుకు కేవ‌లం ప‌దివేల నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు మాత్ర‌మే చేయ‌గలుగుతున్నారు. ఇందులో వేగం పెంచ‌క‌పోతే.. మున్ముందు భారీ న‌ష్టం జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని గ్ర‌హించిన కేంద్ర ప్ర‌భుత్వం అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లుచేప‌డుతోంది. ఈ మేర‌కు నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల ప‌రికరాల‌ను స‌మ‌కూర్చుకునేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌రో రెండు మూడు రోజుల్లోనే నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో మ‌రింత వేగం పెరిగే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. రోజుకు క‌నీసం 20వేల ప‌రీక్ష‌లు చేసే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నాయి. మ‌రికొన్ని రోజుల్లో నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో మ‌రింత వేగం పెంచేందుకు కూడా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని అధికారులు చెబుతున్నారు. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కు అంటే ఆదివారం రాత్రి 9గంట‌ల వ‌ర‌కు మొత్తం 89,534 పరీక్ష‌లు చేసిన‌ట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ప‌రీక్ష‌ల్లో వేగం పెంచితే.. వైర‌స్ సోకిన‌వారికి స‌కాలంలో చికిత్స అందించే అవ‌కాశం ఉంటుంద‌ని వైద్యులు పేర్కొంటున్నారు. 

 

అయితే.. ఇత‌ర దేశాలు అమెరికా, చైనా, స్పెయిన్‌, ఇట‌లీ, ఫ్రాన్స్‌, యూకే త‌దిత‌ర దేశాల్లో ఇప్ప‌టికే ల‌క్ష‌ల సంఖ్య‌లో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రిగాయి. ఈ దేశాల‌తో పోల్చితే.. భార‌త్‌లో వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చాలా స్లోగా జ‌రుగుతున్నాయి. ఇది మంచి ప‌రిణామం కాద‌ని, వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లను స‌కాలంలో చేయ‌కుంటే.. వైర‌స్ మ‌రింత వేగంగా వ్యాపించే ప్ర‌మాదం ఉంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: