ప్రధాని మోడీ విధించిన లాక్‌ డౌన్‌తో దేశమంతా స్తంభించిపోయింది. రైళ్లు , బస్సులూ ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ప్రజలకు కూడా ఇళ్లలో ఉండి పిచ్చెక్కిపోతోంది. కాకపోతే ఆరోగ్యానికి సంబంధించిన విషయం.. ప్రాణాలతో చెలగాటం కాబట్టి తప్పక ఇంట్లో ఉండిపోతున్నారు. తిరిగే కాలూ.. తిట్టే నోరూ ఆగదంటారు. కానీ కరోనా దెబ్బకు అన్నీ ఆగిపోవాల్సి వచ్చింది.

 

 

అయితే ఈ లాక్ డౌన్ నిబంధన ఏప్రిల్ 14 వరకూ అమల్లో ఉంటుందని మోడీ ప్రకటించారు. అంటే ఇంకో వారం రోజులు.. ఆ తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తేస్తారా..లేక.. కొనసాగిస్తారా అన్న దానిపై క్లారిటీ లేదు. ఇప్పటికే మూడు వారాల లాక్‌డౌన్‌తో కేంద్రం, రాష్ట్రం లక్షల కోట్ల ఆదాయాలు కోల్పోయాయి. ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగించడం ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

 

 

అందుకే ఎందుకైనా మంచిదని ఏపీఎస్‌ఆర్టీసీ లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఆన్‌లైన్‌ రిజర్వేషన్లను ప్రారంభించింది. ఈనెల 15 నుంచి బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి సూపర్‌ లగ్జరీ, అల్ట్రా డీలక్స్‌ బస్సులకు రిజర్వేషన్లు ప్రారంభించారు.

 

 

అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సులను టెంపరరీగా ఆపేస్తున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత దశలవారీగా ఏసీ బస్సులను నడుపుతామంటున్నారు. ఒకవేళ నడిపినా ఉష్ణోగ్రత 24-25 డిగ్రీలు ఉండేలా చూస్తారట. మరి ఇంకేం.. మీ ప్రయాణానికి సంబంధించిన టికెట్లు బుక్ చేసేసుకోండి. అయితే లాక్‌ డౌన్‌ ఎత్తేశారు కదా అని ఇష్టం వచ్చినట్టు తిరగకండి. అవసరం ఉండేనే బయటకు రండి. ఎందుకంటే ఇది విహార యాత్రల సమయం కానే కాదు. సంయమనంతో ఉండాల్సిన సమయం కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: