ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి లాక్ డౌన్ తర్వాత రాష్ట్రంలో పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలలో రెడ్ జోన్ మార్గదర్శకాలను కొనసాగించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 14 తర్వాత రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని చెప్పారు. కేంద్రం ఆదేశాల తర్వాత మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యాచరణను అమలులోకి తీసుకొనిరావాలని అధికారులకు సూచించారు. 
 
నిన్న సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో తాడేపల్లిలోని కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఆ వ్యక్తికి కరోనా సోకినట్లుగా భావించి చికిత్స అందించాలని సూచించారు. రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు నిరంతరం సర్వే జరుపుతూ ఉండాలని స్పష్టం చేశారు. 
 
ఢిల్లీలోని మర్కజ్ సమావేశాలకు హాజరైన వారు, వారితో కాంటాక్టులో ఉన్నవారికి వెంటనే పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అధికారులు సీఎంకు రాష్ట్రంలో ఏడు చోట్ల ల్యాబ్ లు ఉన్నాయని మరో మూడు చోట్ల ల్యాభ్ లను పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో మర్కజ్ సమావేశానికి హాజరైన వారిలో ప్రైమరీ కాంటాక్టులకు వెంటనే పరీక్షలు నిర్వహించాలని... ఆ తర్వాత సెకండరీ కాంటాక్టులకు నిర్వహించాలని సీఎం అధికారులు సూచించారు. 
 
అధికారులు ఇప్పటికే రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్ నుంచి 20 నమూనాలను సేకరిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 252 కేసులు నమోదు కాగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 53 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 60 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: