ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోను ఇదే పరిస్థితి నెలకొంది. జపాన్ దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జపాన్ రాజధాని టోక్యోలో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జపాన్ ప్రధాని షింబో అజే కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు ప్రధాని అధికారికంగా స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించనున్నారని తెలుస్తోంది. 
 
ప్రముఖ జపనీస్ పత్రిక మొమియరి ఈ విషయాన్ని పేర్కొంది. ఈరోజు దేశంలో ఎమర్జెన్సీకి సంబంధించిన విధివిధానాలు ప్రకటిస్తారని సమాచారం. దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం టోక్యో గవర్నర్ యురికో కొయికే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీకి సానుకూలంగా వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎమర్జెన్సీ అమలు చేస్తే ప్రజలు కచ్చితంగా సామాజిక దూరం పాటిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
జపాన్ లో ఇప్పటివరకు 3,500 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో జపాన్ రాజధాని టోక్యోలోనే 1,000 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 85 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 4067 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 12 గంటల్లోనే ఏకంగా 490 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఏపీలో 266 కరోనా కేసులు నమోదు కాగా తెలంగాణలో 334 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: