ముంబైలోని వోక్‌హార్ట్ ఆస్ప‌త్రిలో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. ఒక్క‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ఏకంగా 26మంది నర్సుల‌తోపాటు ముగ్గురు డాక్ట‌ర్లు కొవిడ్‌-19 బారిన‌ప‌డ్డారు. వారం రోజుల్లోనే ఈ కేసులు న‌మోదు కావ‌డంతో స్థానికంగా తీవ్ర ఆందోళ‌న‌క‌ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. ప్రాణాల‌కు తెగించి, బాధితుల‌కు వైద్య‌సేవ‌లు అందిస్తున్న డాక్ట‌ర్లు కూడా క‌రోనా వైర‌స్ సోకుతుండ‌డంతో వైద్య‌సిబ్బంది భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. వెంట‌నే బీఎంసీ ఆ ఆస్ప‌త్రిని కంటైన్మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించింది. ఇక్కడి నుంచి ఎవ‌రు కూడా బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి అవ‌కాశం లేదు. ఇందులో ఉన్న‌వారంద‌రికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన త‌ర్వాత‌నే బ‌య‌ట‌కు వెళ్లేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అధికారులు చెబుతున్నారు. ఇక క‌రోనా బారిన ప‌డిన న‌ర్సులు, డాక్ట‌ర్ల‌ను ఇత‌ర ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించి, చికిత్స అందిస్తున్నారు. 

 

అయితే.. మార్చి 27వ తేదీన ఆస్ప‌త్రిలో చేరిన గుండె స‌మ‌స్య పేషెంట్‌కు ఇద్ద‌రు న‌ర్సులు వైద్య‌సేవ‌లు అందించారు. ఆ త‌ర్వాత ఆ ఇద్ద‌రు న‌ర్సులు కూడా అనారోగ్యానికి గుర‌య్యారు. వెంట‌నే వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఆ త‌ర్వాత చాలా మంది అనారోగ్యానికి గుర‌య్యారు. ఈ నేప‌థ్యంలో 26మంది న‌ర్సులు, ముగ్గురు వైద్యులు క‌రోనా బారిన ప‌డిన‌ట్లు తేల‌డంతో ఒక్క‌సారిగా భ‌యాందోళ‌న‌క నెల‌కొంది. దాదాపుగా ఆస్ప‌త్రిలో రెండువంద‌ల మందికిపైగా సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు వీరంద‌రినీ క్వారంటైన్‌లో ఉంచారు. వైద్య‌సేవ‌లు అందిస్తున్న సిబ్బందికి క‌రోనా సోకుతుండ‌డంతో చికిత్స‌లు అందించేందుకు కొంత ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయ‌ని ప‌లువురు వైద్యులు అంటున్నారు. ఇదిలా ఉండ‌గా.. ఢిల్లీలో కూడా ప‌లువురు వైద్యులు ఇప్ప‌టికే క‌రోనా బారిన ప‌డ్డారు. అంత‌కుముందు కేర‌ళ‌లోకూడా ప‌లువురు న‌ర్సులకు కూడా క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: