ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు రాష్ట్రంలో 14 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 266కు చేరింది. ఏపీలోని 13 జిల్లాల్లో 11 జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రం ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అధికారుల ముందస్తు చర్యలు, ప్రజల అవగాహన వల్లే ఈ రెండు జిల్లాల్లో ఇప్పటివరకూ కేసులు నమోదు కాలేదని సమాచారం. 
 
శ్రీకాకుళం జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి గ్రామాల్లోకి ఎవరూ రాకుండా గ్రామస్థులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరైనా వస్తే వారిని క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి జిల్లాకు వస్తే వెంటనే వారి సమాచారాన్ని అధికారులకు చేరవేస్తున్నారు. అధికారులు కొత్తగా వచ్చిన వ్యక్తులు హోం క్వారంటైన్ కు పరిమితం అయ్యేలా చర్యలు చేపడుతున్నారు. 
 
విజయనగరం జిల్లా నుంచి విదేశాలకు వెళ్లిన వారి సంఖ్య చాలా పరిమితం. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తరువాత జిల్లాకు 400 మంది రాగా వారంతా గృహ నిర్భంధానికే పరిమితమయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా సరిహద్దులను మూసివేయడంతో పాటు ఎవరైనా కొత్తవారు కనిపిస్తే వారిని అధికారులు పొలిమేరల్లోనే గుర్తించి క్వారంటైన్ కు తరలిస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ కరోనా కట్టడి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఏపీలోని ఇతర జిల్లాల్లో మాత్రం కరోనా వేగంగా విజృంభిస్తోంది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, వైజాగ్, కడప జిల్లాలలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: