ఢిల్లీలోని నిజాముద్దీన్‌ప్రాంతంలోని మ‌ర్క‌జ్ జమాత్.. ఈ పేరు వింటేనే ఇప్పుడు దేశ‌ప్ర‌జ‌లు ఉలిక్కిప‌డుతున్నారు. ఇక్క‌డ నిర్వ‌హించిన జమాత్ వ‌ల్లే ఈరోజు దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం చూపుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం నాలుగువేల‌కుపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. అందులో 1400కుపైగా కేసులు త‌బ్లిఘి జమాత్‌కు లింకున్న‌వేకావ‌డం గ‌మ‌నార్హం. దేశంలో క‌రోనా వైర‌స్ అదుపులోనే ఉంద‌ని అన‌కుంటున్న త‌రుణంలో త‌బ్లిఘి జ‌మాత్ ఉదంతంతో ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి వంద‌లాదిమంది ముస్లింలు, ప‌లువురు విదేశీయులు కూడా ఈ జ‌మాత్‌కు హాజ‌రై సొంతూళ్ల‌కు వెళ్లారు. దీంతో దేశంలోని మెజార్టీ ప్రాంతాల‌కు క‌రోనా వైర‌స్ వ్యాపించింది. జ‌మాత్‌కు హాజ‌రై వ‌చ్చిన వారిలో ఇప్ప‌టికే ప‌లువురు క‌రోనా బారిన‌ప‌డి మృతి చెందారు.

 

అయితే.. దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు వెంట‌నే మ‌ర్క‌జ్ జ‌మాత్ చీఫ్ మ‌హ్మ‌ద్ సాద్ కంధ‌ల్వితోపాటు మ‌రో నలుగురిపై కేసు న‌మోదు చేశారు. జమాత్ నిర్వ‌హ‌ణ‌పై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ మౌలానా సాద్‌కు 26 ప్ర‌శ్న‌ల‌తో కూడిన‌ నోటీసులు కూడా ఇచ్చారు. కానీ.. తాను స్వీయ‌నిర్బంధంలో ఉన్నాన‌ని, దేశంలో లాక్‌డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో తాను బ‌య‌ట‌కు రాలేన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అయితే.. ఆయ‌న స‌మాధానంతో సంతృప్తి చెంద‌ని పోలీసులు సోమ‌వారం నాడు మ‌రిన్ని ప్ర‌శ్న‌ల‌తో రెండో నోటీసు కూడా ఇచ్చారు. దీనిపై కూడా ఆయ‌న స్పంద‌న అలాగే ఉంది. తాజ‌గా ఇచ్చిన నోటీసులో మ‌ర్క‌జ్ సంస్థ‌కు చెందిన ఆర్థిక విష‌యాల‌పై కూడా ప్ర‌శ్న‌లు వేశారు. 

 

ఈ క్ర‌మంలోనే అన్ని విష‌యాల‌ను పోలీసుల‌కు, ప్ర‌భుత్వానికి ఇచ్చామ‌ని త‌బ్లిఘి జమాత్ ప్ర‌తినిధులు పేర్కొంటున్నారు. మార్చి 15న నిర్వ‌హించిన జ‌మాత్‌కు దేశ వ్యాప్తంగా కేవ‌లం 1010మంది ముస్లింలు, విదేశాల నుంచి 281మంది వ‌చ్చార‌ని వారు చెబుతున్నారు. కానీ.. జ‌మాత్‌కు వేల‌మంది హాజ‌రైన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌లను పాటించాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా సాద్ చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే జ‌మాత్‌కు హాజ‌రైన వారిలో ఎక్కువ‌గా క‌రోనా బారిన‌ప‌డుతున్నార‌ని పోలీసులు అంటున్నారు. ఇదిలా ఉండ‌గా.. ఇప్ప‌టికే త‌బ్లిఘి జ‌మాత్కు వ‌స్తున్న నిధుల‌పై ద‌ర్యాప్తు కూడా ప్రారంభ‌మైంద‌ని పోలీసులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: