దేశంలో కరోనా వైరస్ ఎంతగా పెరిగిపోతోందో అందరూ చూస్తున్నదే. 20 రోజుల క్రితం సంగతి వదిలేస్తే గడచిన ఐదు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని చాలా జిల్లాల్లో వైరస్ చాలా స్పీడుగా వ్యాపించేస్తోంది.  కొన్ని జిల్లాలైతే బాధితుల సంఖ్యను పెంచేయటంలో ఒకదానితో మరోటి పోటి పడుతున్నాయనే చెప్పాలి. ఇంతటి సంక్షోభంలో కూడా ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకూ కరోనా వైరస్ ఒక్కటంటే ఒక్కటి కూడా  నమోదు కాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాలో కూడా ఒక్క కేసు నమోదు కాలేదు లేండి.

 

మిగితా జిల్లాల్లో పోటిలుపడి మరీ కేసుల సంఖ్య పెరిగిపోతున్నా రాజుల నగరం విజయనగరం జిల్లాలో మాత్రం ఎందుకు అడుగుపెట్టలేకపోతోంది. కారణాలేమిటి ? అనేది ఆసక్తికరంగా మారింది. ఇందుకు ప్రధానంగా మూడు కారణాలున్నట్లు సమాచారం. మొదటిది జిల్లా నుండి విదేశాలకు ఉద్యోగం కోసం కానీ చదువు కోసం కాని వెళ్ళిన వాళ్ళ సంఖ్య మిగిలిన జిల్లాలతో పోల్చితే చాలా తక్కువనే చెప్పాలి. మొదట్లో ఏపిలో  కేసులన్నీ విదేశాల నుండి వచ్చిన వాళ్ళ వల్ల నమోదైనవే అని గుర్తుంచుకోవాలి.

 

 అలాగే ఈమధ్య ఢిల్లీలో జరిగిన మత ప్రార్ధనల కోసం వెళ్ళి తిరిగి వచ్చిన వారిలో కొందరి వల్ల ఒక్కసారిగా చాలా జిల్లాల్లో కేసులు పెరిగిపోయాయి. అయితే విజయనగరం జిల్లా నుండి ముగ్గురు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళు ముగ్గురు కూడా స్వచ్చంధంగా అధికారుల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పారు.  అదృష్టమేమంటే పరీక్షల్లో ముగ్గురికీ వైరస్ లేదని తేలింది.

 

ఇక దేశంలోని బయటప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రవాణా సౌకర్యాలు లేకపోవటంతో ఎక్కడి వాళ్ళు అక్కడే  నిలిచిపోయారు. అవస్తలు పడి జిల్లాకు వచ్చిన కొందరిని అధికారులు వెంటనే క్వారంటైన్ సెంటర్లకు తరలించేశారు.  దానికి తోడు గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి వాకాబు చేస్తుండటం కూడా కలిసివచ్చింది. యంత్రాంగం మొత్తం సమన్వయంతో పనిచేస్తున్న కారణంగా జిల్లాలోకి కరోనా వైరస్ అడుగు కూడా పెట్టలేకపోతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: