సీఎం కేసీఆర్ కరోనా గురించి, లాక్ డౌన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 364 కరోనా కేసులు నమోదైనట్టు సీఎం తెలిపారు. రాష్ట్రంలో 45 మంది ఇప్పటివరకు డిశ్చార్జి అయ్యారని... మరో 15 మంది ఎల్లుండి డిశ్చార్జి అవుతారని అన్నారు. కరోనా మన దేశంలో పుట్టిన జబ్బు కాదని... రాష్ట్రంలో లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన 30 మందికి... వారి కుటుంబ సభ్యులు 20 మందికి కరోనా వచ్చిందని ప్రకటన చేశారు. 
 
ఢిల్లీకి వెళ్లొచ్చిన 172 మంది ద్వారా రాష్ట్రంలో 93 మందికి కరోనా సోకిందని అన్నారు. భారత్ లాంటి దేశాల్లో లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదని... లాక్ డౌన్ ఎత్తివేస్తే ఆగమవుతామని అన్నారు. ఈరోజు ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. కరోనా మానవ జాతికి వచ్చిన అతిపెద్ద సంక్షోభమంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీతో లాక్ డౌన్ కొనసాగించాలని తాను చెప్పానని కేసీఆర్ అన్నారు. 
 
ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలు ఇప్పటివరకూ లాక్ డౌన్ ప్రకటించాయని... రాష్ట్ర ప్రజలు లాక్ డౌన్ కు అద్భుతంగా సహకరిస్తున్నాయని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయం లాక్ డౌన్ వల్ల గణనీయంగా తగ్గిపోయిందని అన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఢిల్లీ ప్రార్థనలకు హాజరైన 1089 మందిని గుర్తించామని తెలిపారు. కరోనాపై యుద్ధంలో వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి అద్భుతంగా పని చేస్తున్నారని సీఎం ప్రశంసించారు. రాష్ట్రంలోని వైద్య సిబ్బంది అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నానని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: