కరోనా నేపధ్యంలో విధించిన లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు.. తినడానికి తిండిలేక, చేతిలో డబ్బులు లేక, ఉద్యోగాలు ఊడి జీతాలు లేక ఇంటి అద్దె కట్టలేక ఇలా చెప్పుకుంటూ వెళ్లితే.. కన్నీళ్లు వస్తాయి కానీ కష్టాలు తీరవు.. మరి కొందరైతే సొంతూరుకు వెళ్లలేక అష్టకష్టాలు పడుతున్నారు.. ఇలా ఉండగా మరి కొందరైతే ఇలాగైతే జీవితం సాగదని కాలి నడకన తమ ఊర్లకు పయణం కట్టారు.. ఇకపోతే కొందరు అతి తెలివి గల వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ఊరికి చేరుకోవాలని తమ మెదడుకు పని పెట్టి వ్యూహాలు రచిస్తున్నారు. ఇలాంటి వారిలో ఒక బ్యాచ్ వేసిన ఎత్తుగడ చివరికి బట్టబయలు అయ్యి పోలీసుల తో అక్షింతలు వేసుకున్నారు.. అదేంటో చూస్తే..

 

 

ఈ సంఘటన జమ్మూ కశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో చోటు చేసుకుంది. వాళ్ల సొంత ఊళ్లకు వెళ్లడానికి ముగ్గురు వ్యక్తులు పథకం ప్రకారం వారిలో ఒక వ్యక్తి చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారు. తర్వాత శవాన్ని తీసుకెళ్లేందుకు ఆంబులెన్స్ ను  కూడా అద్దెకు తీసుకున్నారు. ఇక పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఆ ముగ్గురిలో ఓ వ్యక్తి మరణించినట్లు నటించాడు. ఇలా ఆ శవాన్ని తమ గ్రామానికి తీసుకెళ్తున్నామని కనబడిన చెక్‌పోస్ట్‌ల వద్ద పోలీసులకు చెప్పి తప్పించుకున్నారు..

 

 

ఇక ఇంటికి వెళ్లినట్లే అని ఆలోచిస్తుండగా సూరన్ కోట్ చెక్‌పోస్ట్‌‌కు చేరుకోగానే చెకింగ్ కోసం ఆపిన పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చి అంబులెన్స్ ను తనిఖీ చేసి, అందులో శవంలా ఉన్న వ్యక్తికి టెంపరేచర్ టెస్ట్ చేయగా అతను బతికే ఉన్నాడని తెలిసింది.. దీంతో ఆ ముగ్గురు వ్యక్తులతో పాటు డ్రైవర్, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని వారిపై సెక్షన్ 420, 269, 188 కింద కేసు నమోదు చేసి అత్తవారింటికి పంపించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: