పత్రిక కథనాలపై  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు  సీరియస్ అయ్యారు . ఇటీవల గాంధీ ఆసుపత్రిలో  కరోనా బాధితుడు మృతి చెందగా , అతడి సోదరుడు వైద్యులపై దాడి చేసిన విషయం తెల్సిందే . ఇదే అంశం పై పత్రికలు  రకరకాల కథనాలు ప్రచురించాయి . వైద్యులకు రక్షణ ఎక్కడ ? అంటూ ఒక దినపత్రిక ప్రచురించిన కథనాన్ని సోమవారం ప్రెస్ మీట్ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్   ప్రస్తావిస్తూ , తన ఆక్రోషాన్ని వెళ్లగక్కారు . పత్రికలకు సమయం వచ్చినప్పుడు తగినరీతి లో గుణపాఠం చెబుతామంటూ  హెచ్చరించారు . అంతటితో ఆగకుండా ఇలాంటి రాతలు రాసేవారికి కరోనా వ్యాధి  సోకాలని శాపనార్ధాలు పెట్టారు .

 

కేసీఆర్ వ్యవహారశైలి పట్ల తరుచూ విమర్శలు విన్పిస్తున్న ఆయన మాత్రం తన వైఖరిని మార్చుకోవడం లేదు సరికదా... పత్రికలపై , పత్రిక ప్రతినిధులపై ఒంటికాలితో లేస్తుతున్నారు .  రాష్ట్రంలోకి 20 వేలమంది విదేశాల నుంచి వచ్చారని మీరే చెబుతున్నారు కదా ... అంటూ ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో  ఒక పత్రికా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు  కేసీఆర్ ప్రతిస్పందన చూసిన వారికి ఆశ్చర్యం వేయక మానదు . సదరు ప్రత్రికా ప్రతినిధి ఏమి అడగాలని అనుకుంటున్నారో కూడా వినకుండానే అతడు చిన్నబుచ్చుకునే విధంగా కేసీఆర్ ఎదురుదాడి చేశారు .

 

ఇక మరొక ప్రతినిధి పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న ఆర్ధిక సహాయం సరిపోతుందా? అని ప్రశ్నించగా ఎంతివ్వమంటావు ... లక్షన్నర ఇవ్వమంటావా ?? అంటూ వెటకారం చేయడం అన్నది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి తగునా అన్న ప్రశ్నలు విన్పించాయి . ఇక తాజాగా ఒక పత్రిక లో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆయన నైజాన్ని తెలియజేశాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు . తనపై కానీ తన ప్రభుత్వంపై వచ్చే విమర్శలను కేసీఆర్ సహించలేకపోతున్నారని పేర్కొన్నారు . అందుకే ఈ తరహాలో పత్రికలపై ఎదురుదాడి చేస్తున్నారని అంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: