ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది.  కొత్తగా 37 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3వందలు దాటింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. మరోవైపు సోషల్ మీడియాలో ప్రభుత్వం బురద జల్లేవారిపై కేసులు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బారిన పడి ఇద్దరు చనిపోయారు. అనంతపురం జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 303కు చేరింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల సమయానికి కొత్తగా 37 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 18, నెల్లూరు జిల్లాలో 8, పశ్చిమ గోదావరి జిల్లాలో 5, కడప జిల్లాలో 4, కృష్ణ - ప్రకాశం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఆరుగురు డిశ్చార్జ్‌ అయ్యారు. 

 

అత్యధికంగా కర్నూలు జిల్లాలో 74 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నెల్లూరు ల్లాలో 42, గుంటూరు జిల్లాలో 32, కృష్ణ జిల్లాలో 28, కడప జిల్లాలో 27, ప్రకాశం జిల్లాల్లో 24, విశాఖపట్నం జిల్లాలో 20, చిత్తూరు జిల్లాలో 17, పశ్చిమ గోదావరి జిల్లాలో 21, తూర్పు గోదావరి జిల్లాలో 11, అనంతపురం జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

 

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మొత్తం కేసుల్లో ఢిల్లీ వెళ్లివచ్చినవారివే మూడింట రెండొంతులు ఉన్నాయని అధికారులు ఆయనకు వివరించారు. ప్రైమరీ కాంటాక్ట్‌లకు కూడా పరీక్షలు పూర్తయినట్లు తెలిపారు. ఇంటింటి సర్వే కార్యక్రమం కొనసాగుతోందని అధికారులు చెప్పారు. పరీక్షలకు సరిపడా టెస్టింగ్ కిట్స్ సమకూర్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. క్వారంటైన్లు, ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని కోరారు.

 

మరోవైపు రాష్ట్రంలో వైద్య పరికరాల కొరత లేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. సరిపడా పీపీఈలు ఉన్నందున తమిళనాడు లాంటి రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తున్నట్టు ఆయన వివరించారు. సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నవారిపై కేసులు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు.

 

కేసుల తీవ్రత పెరుగుతూ ఉండడంతో లాక్‌డౌన్ మరింత పటిష్టంగా అమలు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. నిత్యావసరాల కొనుగోలు సమయాన్ని కూడా కుదించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఇళ్లు దాటి బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు పాజిటివ్‌ కేసులున్న వారి ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఒకే ప్రాంతంలో ఎక్కువ పాజిటివ్‌ కేసులు ఉంటే.. ఆ ఏరియాను రెడ్‌జోన్‌గా ప్రకటిస్తున్నారు. ఆ ఏరియాలోకి ఎవరినీ రాకుండా చూసుకుంటున్నారు.

 

మర్కజ్‌కు వెళ్ళి వచ్చిన వారితో పాటు వారుంటున్న ఏరియాలపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వారందరికీ పరీక్షలు నిర్వహించిన అధికారులు.. ప్రైమరీ కాంటాక్ట్‌లను క్వారంటైన్ లేదా ఐసోలేషన్ కేంద్రాలకు తరలించింది. జియో ట్యాగింగ్ ద్వారా వారిని నిత్యం పర్యవేక్షిస్తోంది. హోమ్‌ క్వారంటైన్లలో ఉంటున్నవారిపై నిఘా కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: