రాజులా బతికిన రొయ్య రైతు విలవిల్లాడుతున్నాడు. కొనుగోళ్లు లేక ఒడ్డున పడ్డ చేపలా కొట్టుకుంటున్నాడు.  కరోనా ప్రభావంతో ధర పతనం అవ్వడంతో రైతులు రోడ్డున  పడే పరిస్థితి వచ్చేస్తోంది. ప్రభుత్వం చెప్పిన ధరలు రైతుల  దగ్గరకు వచ్చే సరికి మాత్రం అమలు కావడం లేదు. దీంతో రొయ్యల రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారు.

 

ఏపీలో అక్వా రంగం సంక్షోభంలో పడింది. కరోనా  కారణంతో కొనుగోళ్లు ఎగుమతులు లేక రైతులు ఆందోళన  చెందుతున్నారు. ఏరోజుకారోజు అమ్మకాలు జరగాల్సిన  రంగం కావడంతో రవాణా నిలిచిపోవడం తో ఇబ్బందులు  పడుతున్నారు. మొదట్లో రోయ్యల ఫీడ్ కోసమే ఇబ్బంది పడే  పరిస్థితి వచ్చింది. అయితే మంత్రి చొరవతో ప్రభుత్వం  ఆదేశాలతో ఆ ఇబ్బందులు తొలగిపోయాయి. అయితే  ఇప్పుడు ఎగుమతులు లేవంటూ కోనుగోళ్లు  జరపకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోల్డ్  స్టోరేజ్ లలో ఖాళీ లేవని, ప్రాసెసింగ్ కు కూలీలు రావడం  లేదని వ్యాపారులు కొనుగోళ్లు తగ్గించారు. మరోవైపు ఐస్  ఫ్యాక్టరీలు దొరక్క నిల్వ చేసే పరిస్థితిలేదని వ్యాపారులు  చెపుతున్నారు. దీంతో ధర భారీగా పతనమై.. రైతులు  తీవ్రంగా నష్ట పోయే పరిస్థితి తలెత్తింది.

 

అక్వా రంగానికి పొంచి ఉన్న ముప్పుపై ప్రభుత్వం కూడా  వెంటనే స్పందించింది. స్వయంగా సీఎం కూడా సమీక్షలు  చేశారు. అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోమని సూచించారు. వ్యాపారులతో  మాట్లాడి ప్రభుత్వం పంటకు ధర కూడా నిర్థేసించింది. అయితే సర్కారు ఆదేశాలు మాత్రం అమలు కావడం  లేదు. 

 

రొయ్యలు పట్టాల్సిన సమయం వస్తే వెంటనే పట్టెయ్యాలి. ఏ  మాత్రం ఆలస్యం చేసినా చెరువు అంతా నష్ట పోయే పరిస్థితి  ఉంటుంది. చేపల విషయంలో ఇలాంటి ఇబ్బంది లేకున్నా ..  రొయ్యలను మాత్రం వెంటనే పట్టి తరలించాలి. ఎక్కువ  రోజులు ఉంచితే.. మేత కూడా భారంగా మారుతుంది. ఆ రకంగా  కూడా రైతు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు తమ  సరుకు కొనకపోయినా పర్వాలేదని....కనీసం కోల్డ్ స్టోరేజ్ లో  పెట్టుకునే అవకాశం ఇవ్వాలని అక్వా రైతులు కోరుతున్నారు.  విదేశాలను ఎగుమతుల విషయంలో ఎటువంటి ఇబ్బంది  లేకున్నా.. వ్యాపారులు మోసం చేస్తున్నారని చెబుతున్నారు. ఎగుమతులు ఆగితే.. రైతులతో పాటు ప్రభుత్వమూ ఆదాయం కోల్పోతుంది. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకపోతే.. ఊహించని నష్టం తప్పదని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: