హిందూ దేవాలయాలకు సంబంధించిన వసతి గృహాలను క్వారంటైన్ సెంటర్లుగా మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఈ విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్ కు లేఖ రాశారు. కోట్లాది మంది మంది హిందువులు ఆరాధించే దేవాలయాల ప్రాంగణాల్లో క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు శోచనీయమన్నారు. అయితే ఆలయాల్లో క్వారంటైన్లు అవాస్తవం అంటున్నారు అధికారులు. 

 

ఏపీలో కరోనా కేసులు రోజూ రోజుకు పెరిగిపోతున్నాయి. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి కరోనా సోకడంతో రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. ముందుజాగ్రత్తగా బాధితులను కుటుంబ సభ్యులు, బంధువులు, వారిని కలిసిన వారందరినీ క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు అధికారులు. అక్కడ జనాలు నిండిపోతుండడంతో దేవాలయాలకు సంబంధించిన వసతి గృహాలను క్వారంటైన్ సెంటర్లుగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరులోని శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయ వసతి గృహం,టిటిడి సంబంధించిన తిరుచానూరులోని పద్మావతి నిలయం వసతి గృహాలను క్వారంటైన్ సెంటర్లగా ఏర్పాటు చేశారు. ఐతే ఏపీ ప్రభుత్వ తీరుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది మంది హిందువులు ఆరాధించే దేవాలయాలకు సంబంధించిన వాటిలో క్వారంటైన్ కేంద్రాలుగా మార్చడం శోచనీయమని మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు కన్నా. ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

 

కాణిపాకం ఆలయానికి  సంబంధించి ఒక వీడియో వైరల్ చేస్తూ కొందరు ముస్లింలు ఆలయాంలోకి ప్రవేశించారని సమాజిక మాధ్యమాల్లో ఉంచారు.అది కాస్తా వైరల్ కావడంతో బిజెపి నేతలు సైతం రంగంలోకి దిగి ఆలయంలో క్వారంటైన్ సెంటర్లు ఏంటి అంటూ మండి పడ్డారు. వెంటనే ప్రభుత్వ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే వైరల్ అయిన వీడియోలు అవాస్తవం అంటూ కొట్టిపారేశారు ఆలయ ఈవో. 

 

కలెక్టర్ ఆదేశాలతో ఆలయ సమీపంలోని  గణేష్ సదన్ వసతి గృహం లో క్వారంటైన్ ఏర్పాటు చేశామన్నారు ఈవో.  ప్రభుత్వ ఆదేశాలతో కాణిపాకం ఆలయాన్ని 23వ తేదీ నుంచే మూసేశామన్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే బీజేపీ నేతలు మాత్రం అసలు  దేవాలయాలకు సంబంధించి వసతి గృహాల్లో క్వారంటైన్ అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. చర్చ్, మసీదులో ఇటువంటి వైద్య కేంద్రాలు ఏమైనా పెట్టారా అని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: