తెలంగాణలో విద్యావ్యవస్థపై కరోనా ప్రభావం పడింది. కేజీ నుంచి పీజీ వరకు చదువులు అతలాకుతలం అయ్యాయి. సాధారణ పరిస్థితులు వస్తే కానీ విద్యాలయలు ప్రారంభం అయ్యే అవకాశం కనిపించటంలేదు. ఎంట్రెన్సులు కూడా జరిగేలా లేవు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 

 

పరీక్షల టైమ్‌లో కరోనా మహమ్మారి విరుచుకుపడింది. దేశంలో విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. కేజీ నుంచి పీజీ వరకు ఎక్కడి పరీక్షలు అక్కడే ఆగిపోయాయి. తెలంగాణలో అదే పరిస్థితి ఉంది. ఇంటర్‌లో ఒక్క పరీక్ష తప్ప అన్ని అయిపోయాయి. 10వ తరగతి మూడు పరీక్షలు జరిగాయి. మిగతావి ఎప్పుడు జరుగుతాయో కరోనాపై ఓ క్లారిటీ వస్తేనే కానీ చెప్పలేని పరిస్థితి. ఒకటి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించాలా..విద్యార్థులను ప్రమోట్ చేయాలా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం. ఇక డిగ్రీ, పీజీ పరీక్షలు కూడా ఆలస్యంగానే జరగనున్నాయి.

 

ఇక...వచ్చే విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తుంది. 10వ తరగతి పరీక్షలు జరిగి పలితాలు వస్తే తప్ప ఇంటర్ అడ్మిషన్‌లు ప్రారంభం కావు. ఇంటర్ వాల్యూయేషన్ పూర్తి అయి రిజల్ట్స్‌ వస్తే తప్ప డిగ్రీ, తత్సమాన కోర్సుల్లో అడ్మిషన్లు స్టార్ట్ కావు. ఇక తెలంగాణలో వచ్చే నెలలో జరగాల్సిన కామన్ ఎంట్రెన్స్ టెస్టులు వాయిదా పడనున్నాయి. ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తే తప్ప ఇంజినీరింగ్ అడ్మిషన్లు జరగవు. మిగతా ఎంట్రెన్సులు జరిగితేనే ప్రొఫెషనల్ కోర్సుల అడ్మిషన్లు ప్రారంభం కావు. కేంద్రం కూడా అన్ని రకాల ఎంట్రెన్సులను మే చివరి వరకు వాయిదా వేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కోరింది.

 

అయితే... ఒకవేళ ఈ నెల 14 తర్వాత కేంద్రం లాక్‌డౌన్ ఎత్తేసినా కొన్ని ఆంక్షలు మాత్రం పెట్టే అవకాశం ఉంది. సోషల్ గ్యాదరింగ్ ఉండే ఏ కార్యక్రమానికీ అనుమతి ఇచ్చే అవకాశం లేదు. విద్యా సంస్థలు ప్రారంభం అవుతాయా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. ఆన్లైన్‌లో తరగతుల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది.
మొత్తానికి...లాక్‌డౌన్‌ వేళ తెలంగాణలో పరీక్షల నిర్వహణ మాత్రం అగమ్యగోచరంగా తయారైంది. ఏది ఏమైనా...ఈ నెల 14 తర్వాతే దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: