తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్నటివరకూ 364 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రం నుంచి ఢిల్లీ ప్రార్థనలకు భారీ సంఖ్యలో హాజరు కావడంతో రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో నిన్న 30 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా నిర్ధారణ అయిన వారికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. కరోనా అనుమానితులను ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాలకు పరిమితం చేసింది. 
 
వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తే నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపి ఫలితాల ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తించింది. ప్రభుత్వం ఈరోజు నుంచి పాజిటివ్ కేసులు నమోదైన వారి ఇంటి చుట్టుప్రక్కల కిలోమీటర్ పరిధిలో ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేయనుంది. 
 
ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారి బ్లడ్ శాంపిల్స్ సేకరించి... పరీక్షలు చేసి కరోనా ఉందో లేదో నిర్ధారిస్తారు. తెలంగాణ రాష్ట్రమంతటా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలలో ఈరోజు నుంచి ర్యాపిడ్ సర్వే జరగనుంది. ఢిల్లీ నుంచి మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారే ఎక్కువగా కరోనా భారీన పడటం గమనార్హం. సీఎం కేసీఆర్ నిన్న ప్రజలనుద్దేశించి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగిస్తానని కేసీఆర్ ప్రకటన చేయడంతో ఏపీలో కూడా లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: