కరోనా దెబ్బకు అన్ని రకాలు చిన్న పరిశ్రమలు విలవిలలాడుతున్నాయి. అందులో ప్రధానంగా ఐస్‌క్రీమ్ పరిశ్రమ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మామూలుగా ఐస్‌క్రీమ్ ఇండస్ట్రీ లాభాలు చూసేది వేసవిలో మాత్రమే. అటువంటి వేసవిలో కరోనా ప్రభావంతో ఆ వ్యాపారానికి తాళం పడింది. దీంతో ఆ పరిశ్రమ దేశవ్యాప్తంగా పదివేల కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది.

 

ఐస్‌క్రీమ్ వ్యాపారానికి వేసవి కాలమే సీజన్‌. ఏడాది మొత్తం జరిగే వ్యాపారంలో అధిక భాగం వేసవి నాలుగు నెలల్లోనే జరుగుతుంది. ఫిబ్రవరి నుంచి మే చివరి వరకు ఐస్‌ క్రీమ్‌ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఆ తర్వాత జూన్‌ మొదటి వారంలో రుతుపవనాలు రాగానే వ్యాపారం నెమ్మదిస్తుంది.

 

పట్టణం, పల్లె అనే తేడా లేకుండా ఐస్‌ క్రీమ్‌ పార్లర్లు ఎండా కాలంలో కిటకిటలాడుతాయి. సాయంత్రం కాగానే కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఐస్‌ క్రీమ్‌ పార్లర్ల ముందు చేరిపోతుంటారు. పార్లర్లు మాత్రమే కాక, చిన్న చిన్న బస్తీల్లోనూ, వీధుల్లోనూ ఐస్‌ క్రీమ్‌ బళ్లు నడుపుతూ అనేక మంది ఎంతో కొంత సంపాదించుకుంటారు.

 

అయితే, వేసవి కాలం మొదలవుతుండగానే కరోనా ప్రభావం కూడా అంతకంతకూ పెరిగిపోయింది. దీంతో ఐస్‌క్రీమ్ వ్యాపారం అనుకున్నంతగా అందుకోలేకపోయింది. ఆ తర్వాత లాక్‌డౌన్‌ కారణంగా పూర్తిగా పడిపోయాయి. లాక్‌డౌన్ ఎత్తివేశాక కూడా పుంజుకోవడం కష్టమేనంటున్నాయి వ్యాపారవర్గాలు. వేడి వాతావరణంలో వైరస్‌ బతకదనే ప్రచారంతో.. ఇప్పటికే ఇళ్లల్లో, ఆఫీసుల్లో ఏసీలను వాడడడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఐస్‌క్రీమ్‌ జోలికి వెళ్లే వారి సంఖ్య నామమాత్రంగానే ఉండే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు వ్యాపారులు. ఇదే ధోరణి కొనసాగితే ఐస్‌ క్రీమ్‌ పరిశ్రమ మరింత నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి పరిశ్రమ వర్గాలు.

 

కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న  చిన్న చిన్న పరిశ్రమలు
కరోనా కారణంగా కుప్పకూలిపోయిన ఐస్‌ క్రీమ్ కంపెనీలు
సరిగా ఎండాకాలంలో వచ్చే సమయంలో ప్రారంభమైన కరోనా
లాక్‌డౌన్ ఎత్తివేసినా కోలుకునే వీలు లేదంటున్న వ్యాపారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: